Begin typing your search above and press return to search.

విషాదం వేళ ఆ దూకుడేంది జ‌గ‌దీశ్‌?

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:11 AM GMT
విషాదం వేళ ఆ దూకుడేంది జ‌గ‌దీశ్‌?
X
కొండంత విషాదాన్ని తెచ్చిన‌ వేముల‌కొండ ఉదంతం ఆ ప్రాంతవాసుల్నే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారంద‌రిని విషాదంలో ముంచెత్తింది. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అమాయ‌కుల ప్రాణాలు ఎలా గాల్లోకి క‌లిసిపోతాయ‌న్న దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్ట‌ర్ న‌డిపిన 60 ఏళ్ల వృద్ధుడు.. నెత్తి మీద‌కు వ‌చ్చిన వ‌య‌సుతోనైనా పెద్ద‌రికంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. నిండు ప్రాణాలు నిలిచేవి.

అందుకు భిన్నంగా నిలువెత్తు నిర్ల‌క్ష్యంతో చేతిలో సిగిరెట్ ప‌ట్టుకొని.. కాళ్ల మ‌ధ్య‌న స్టీరింగ్ పెట్టుకొని న‌డిపిన తీరుకు ఏకంగా 15 మంది మృత్యువాత ప‌డ్డ వైనం తెలిసిందే.

ఈ విషాద ఉదంతం ప్ర‌జ‌ల్ని క‌లిచివేసింది. ఇలాంటి స‌మ‌యాల్లో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బ్యాలెన్స్ త‌ప్పి.. మాట అనేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. బాధితుల‌కు ఒళ్లు మండేలా చేసింది. వేములకొండ విషాదం త‌ర్వాత మృతుల కుటుంబాల‌కు రూ.15 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ స్థానిక కాంగ్రెస్‌ నేత డిమాండ్ చేశారు.

ఇలాంటివేళ‌ల్లో భావోద్వేగాలు భారీగా ఉంటాయి. ఇలాంటి డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని.. వీలైనంత ఎక్కువ న‌ష్ట‌ప‌రిహారాన్ని అందిస్తామ‌న్న మాట చెబితే వివాద‌మే ఉండేది కాదు. కానీ.. అందుకు భిన్నంగా మంత్రి జ‌గ‌దీశ్ నోరు జారేశారు.

చేతిలో ప‌వ‌ర్ ఉండ‌ట‌మో.. లేదంటే.. తామేం చెబితే అదే జ‌ర‌గాల‌న్న మైండ్ సెట్ కావొచ్చు.. జ‌గ‌దీశ్ అన‌కూడ‌ని మాట‌ను అనేశారు. ఇస్తే.. గిస్తే బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం తాము ఇవ్వాలే త‌ప్పించి కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తే వాటిని తాము తీర్చేదేమిటి? అనుకున్నారేమో కానీ.. ఆయ‌న నోటి నుంచి అల‌వోక‌గా మాట‌లు జారారు. దీంతో.. మంత్రి జ‌గ‌దీశ్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.

బాధితుల‌కు రూ.15 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా కావాల‌న్న డిమాండ్‌ పై స్పందించిన మంత్రి జ‌గ‌దీశ్‌.. రూ.15ల‌క్ష‌లు స‌రిపోతాయా? రూ.50 ల‌క్ష‌లు వ‌ద్దా? అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య‌ల‌తో వివాదం మొద‌లైంది. మీలాంటోళ్ల‌ను చాలామందిని చూశాం.. బాధ్య‌త‌గా మెల‌గ‌టం నేర్చుకోండి.. శ‌వాల మీద పేలాలు ఏరుతున్నారు.. చ‌చ్చిన కాడ రాజ‌కీయాలు చేస్తారా? అంటూ మండిప‌డ్డారు.ద ఈంతో.. బాధితులు తీవ్ర‌స్థాయిలో మంత్రిపై ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి మాట‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. త‌మ మ‌నుషులు మ‌ర‌ణించి పుట్టెడు శోకంలో ఉన్న వేళ‌.. వారిని అనున‌యించాల్సింది పోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే మ‌రింత న‌ష్టం వాటిల్ల‌టం ఖాయం. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు మంత్రి స్థానంలో ఉన్న వారి నోటి వెంట వ‌స్తే.. ప్ర‌భుత్వంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే నేత‌ల‌కు క‌ళ్లాలు వేయాల్సిన బాధ్య‌త సీఎం కేసీఆర్ మీద ఉంది. లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌స్తోంద‌న్న‌ది మ‌రిచిపోకూడ‌దు.