Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాటిన మొక్క.. జగన్ 2.0లో మంత్రి అయ్యారల!

By:  Tupaki Desk   |   11 April 2022 5:46 AM GMT
చంద్రబాబు నాటిన మొక్క.. జగన్ 2.0లో మంత్రి అయ్యారల!
X
ఏపీ అధికారపక్షంలో ఎమ్మెల్యేలకు కొదవ లేదు. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు చెప్పే తరహాలో ఎమ్మెల్యే కనిపించరు. చంద్రబాబు నాటిన మొక్కగా 2019 ఎన్నికలకు ముందు తనను తాను పరిచయం చేసుకుంటూ ఎదిగిన విడుదల రజనీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ 2.0లో మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. ఆమే.. చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే కమ్ ఈ రోజు జగన్ కొత్త కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు విడుద రజనీ.

‘మీరు నాటిన మొక్కను సార్’ అంటూ ఆవేశంతో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరించే ఆమె మాటలకు ఏ మాత్రం పొంతన లేనితనం ఆమె చేతల్లో కనిపిస్తూ ఉంటుంది. టైం చూసుకొని టీడీపీ నుంచి జంప్ అయి.. వైసీపీలో టికెట్ ను సొంతం చేసుకున్న ఆమె.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటకు వెళ్లిన కొత్త వారు విడుదల రజనీ ప్రచారాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ఏపీలో ఫ్లెక్సీల కల్చర్ ఎక్కువే. దానికి పరాకాష్ఠగా ఉంటుంది విడుదల రజనీ ప్రచార యవ్వారం.

అత్యంత పిన్న వయసులోనే మంత్రి పదవిని దక్కించుకున్న ఆమె తీరు మిగిలిన వారికి భిన్నంగా చెబుతుంటారు. 1990 జూన్ 24న పుట్టిన విడుదల రజనీ వయసు 31 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులోనే మంత్రి పదవిని సొంతం చేసుకోవటం.. అందులోనూ తీవ్రమైన పోటీ వేళలో కావటం విశేషంగా చెప్పాలి. 2011లో హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీకాలేజీలో బీఎస్సీ పూర్తిచేసి.. హైదరాబాద్ లోనే ఒక ఐటీ సంస్థలో ఉద్యోగిగా పని చేశారు. అనంతరం ఆమె మనసు రాజకీయాల వైపు మొగ్గింది.

2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరిన ఆమెకు కుమారస్వామితో వివాహమైంది. మీరు నాటిన మొక్కను సార్ అంటూ.. ఐటీ రంగంలో చంద్రబాబు గొప్పను కీర్తించిన ఆమె వీడియో ఇప్పటికి వైరల్ గా నిలుస్తోంది. చిలకలూరిపేటలో ఎన్జీవోను ఏర్పాటు చేసిన ఆమె.. 2018లో టీడీపీ నుంచి బయటకు వచ్చారు. అనూహ్యంగా 2019లో చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కావటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేనా.. తన రాజకీయ గురువుగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావుతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన రజనీ.. చివరకు గురువు మీద 8301 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సంచలన విజయంతో మంత్రి పదవి లభిస్తుందన్న అంచనాలు వ్యక్తమైనా.. మొదటి రౌండ్ లో దక్కలేదు. తాజాగా జగన్ 2.0 కాబినెట్ లో ఆమెకు చోటు దక్కించుకున్నారు. తీవ్రమైన పోటీ ఉన్న వేళ.. తన మార్కును ప్రదర్శించి.. అధినేత మనసును దోచుకున్న ఆమె మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఏ పోర్టు ఫోలియో ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదల రజనీకి హోం మంత్రి పదవి ఇస్తారన్న టాక్ నడుస్తోంది.

మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. చంద్రబాబు నాటిన మొక్క అనతి కాలంలో అంచలంచెలుగా ఎదుగురూ.. గురువుకే షాకిచ్చిన ఆమె.. వర్తమాన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారన్న పేరు ఉంది. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.