Begin typing your search above and press return to search.

సాయితేజ్ దుర్మరణానికి కొన్ని గంటల ముందు వీడియో కాల్

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:35 AM GMT
సాయితేజ్ దుర్మరణానికి కొన్ని గంటల ముందు వీడియో కాల్
X
లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడు గొప్పతనం పెద్దగా బయటకు రాదు. తాజాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురి కావటంతో.. ఆయనతో పాటు మొత్తం పదమూడు మంది మరణించటం తెలిసిందే.

మరణించిన వారిలో తెలుగోడు.. మదనపల్లి కుర్రాడు సాయితేజ ఉన్నాడు. 29 ఏళ్ల ఈ కుర్రాడి గురించి.. అతడి అసాధారణ శక్తి సామర్థ్యాల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. కేవలం తొమ్మిదేళ్ల వ్యవధిలోనే సాధారణ సిపాయి స్థాయి నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్సు స్టాప్ మనసు దోచుకున్న వైనం ఆసక్తికరంగానే కాదు.. మనోడి మొనగాడితనం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

చిత్తూరు జిల్లా కరబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన ఇతను.. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదగటం చూస్తే.. అతని శక్తిసామర్థ్యాలు ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి సెలెక్టు అయిన అతను కొంతకాలం జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వహించాడు. ఏడాది తర్వాత పారా కమాండో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. సెలక్షన్ మొదలు ట్రైనింగ్ వరకు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొన్న అతను.. అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొని మరీ పారా కమాండో అయ్యాడు.

అత్యంత క్లిష్ట కాలంలో వినియోగించే పారా కమాండో కావటం అంత తేలికైన విషయం కాదు. వీరి సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయానికి వస్తే.. ఆకాశమార్గాన శత్రు స్థావరాలకు వెళ్లి.. వారిని మట్టి కరిపించే మొనగాళ్లగా వీరిని చెప్పొచ్చు. మెరుపుదాడులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పారా కమాండో స్థాయికి చేరటం ఒక ఎత్తు అయితే.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ వ్యక్తిగత సిబ్బందిగా ఎంపిక కావటం అంటే మాటలు కాదనే చెప్పాలి. సాయి తేజలోని శక్తి సామర్థ్యాల్ని గుర్తించి.. అతన్నితన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా ఎంపిక చేసుకున్నారు. ఇతడి తమ్ముడు కూడా సైన్యంలో ఉన్నాడు. ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

సాయితేజ వ్యక్తిగత విషయాలకు వస్తే ఇతడికి భార్య.. కొడుకు.. కుమార్తె ఉన్నారు. వారిద్దరూ చాలా చిన్నపిల్లలు. కొడుకు మోక్షజ్ఞకు ఐదేళ్లు కాగా..కుమార్తె దర్శినికి రెండేళ్లు. రావత్ వ్యక్తిగత భద్రత సిబ్బందిగా మారిన తర్వాత ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఏడాది క్రితమే కుటుంబాన్ని ఢిల్లీ నుంచి మదనపల్లెకు మార్చారు. వినాయకచవితి సందర్భంగా ఇంటికి వచ్చి.. కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు.

అనూహ్య మరణానికి కొన్ని గంటల ముందు.. భార్యకు ఫోన్ చేసిన సాయి తేజ.. కుమార్తె దర్శిని చూడాలని ఉందని.. వీడియోకాల్ చేయాలని కోరాడు. అనంతరం వీడియో కాల్ లో మాట్లాడుతూ సంతోషంగా గడిపాడు. అలాంటి అతడు గంటల వ్యవధిలోనే అనూహ్య మరణానికి గురైన వైనం షాకింగ్ గా మారింది. ఇతడి మరణవార్తతో కుటుంబ సభ్యులే కాదు.. ఇతని శక్తిసామర్థ్యాలు.. వ్యక్తిగతంగా తనకుతాను ఎదిగిన వైనం గురించి తెలిసిన వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోతున్న పరిస్థితి.