Begin typing your search above and press return to search.

కేసీఆర్ తాజా మానసపుత్రిక.. ‘విదేశీ భవన్’

By:  Tupaki Desk   |   29 Jan 2017 5:02 AM GMT
కేసీఆర్ తాజా మానసపుత్రిక.. ‘విదేశీ భవన్’
X
దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని కొన్ని ప్రత్యేకతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నాయని చెప్పాలి. ఎదుటి వ్యక్తులు ఎవరికైనా సరే.. సలహాలు.. సూచనలు ఇవ్వటానికి ఆయన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. తనదైన ప్రకటనలతో ప్రజల్లో ఎప్పటికప్పుడు కొత్త ఆశలు.. ఆకాంక్షలు వ్యక్తమయ్యేలా చేస్తారు. నిజానికి ఈ రెండు అలవాట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేనప్పటికి రెండింటిలోనూ ఆయన తన సత్తాను చాటుతుంటారు.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో.. ఈ అంశంపై ఎలాంటి స్టాండ్ తీసుకోవాలా? అని కిందామీదా పడుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకొని.. ఆయనకు నోట్ల రద్దు పరిణామాలపై సలహాలు సూచనలు ఇచ్చి మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. ఓపక్కన సలహాలు.. సూచనలు ఇస్తూనే.. మరోవైపు కొత్త కొత్త పథకాల్ని.. కార్యక్రమాల్ని ఆయన ప్రకటిస్తూ ఉంటారు.

గడిచిన రెండున్నరేళ్ల కాలంలో హైదరాబాద్ మహా నగరంలో పలు భవన్ లను ఏర్పాటు చేస్తామని.. వాటికి స్థలంతో పాటు నిధుల్ని ఇస్తామని చెప్పిన కేసీఆర్.. తాజాగా మరో భవన్ ముచ్చట చెప్పేశారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విద్య.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నవారు ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ లో విదేశీ భవన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ఆయన వెల్లడించారు.

ఇందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇంతకీ ఈ మాటలన్ని కేసీఆర్ ఎవరికి చెప్పారంటారా? అక్కడికే వస్తున్నాం. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ లో తనను కలవటానికి వచ్చిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి దానేశ్వర్ మూలేను కలిసిన సందర్భంగా కేసీఆర్.. ఆయనకు పలు సలహాలు.. సూచనలతో పాటు.. విదేశీ భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విదేశీ భవన్ తో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ప్రపంచంలో ఎక్కడ.. ఏ భారతీయుడికి ఇబ్బంది కలిగినా.. వెంటనే స్పందించి వారికి సహకారం అందించే రీతిలో వ్యవస్థను సిద్దంచేయాలన్న మాటను చెప్పారు. విదేశీ వ్యవహారాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి కేంద్ర విదేశాంగ కార్యదర్శికి కేసీఆర్ కొన్ని సూచనలు అందించినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విదేశీ భవన్ విషయంలో కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన విదేశీ భవన్.. గత భవన్ ల మాదిరి మాటల్లోనే ఉండిపోతుందా? కార్యరూపం దాలుస్తుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/