Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ మదిలో కొత్త ఆలోచన నాటారా?

By:  Tupaki Desk   |   4 July 2015 9:49 AM GMT
కేసీఆర్‌ మదిలో కొత్త ఆలోచన నాటారా?
X
ఐడియాల పుట్టగా పేరు పొందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో కొత్త ఐడియా ఒకటి నాటిన ఘనత మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుగా చెబుతున్నారు. తాజాగా ఆయన రచించిన ''ఉనికి'' పుస్కక ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను చేశారు.

పుస్తకాలు రాయటానికి భాష మీద మంచి పట్టు ఉన్న వారు రాస్తే బాగుంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఒక పుస్తకం రాస్తే బాగుంటుందన్న వ్యాఖ్య ఒకటి చేశారు.

నిజమే.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు.. అవమానాలు.. అనుభవాలున్న కేసీఆర్‌ కానీ ఒక పుస్తకం రాస్తే అంతకు మించిన మంచి విషయం ఏమి ఉంటుంది. కేసీఆర్‌ నోటి వెంట తరచూ వచ్చే ఒక మాటనే తీసుకుంటే.. తెలంగాణ ఉద్యమం స్టార్ట్‌ చేసినప్పుడు తాను ఒక్కడినేనని.. కారు చీకటిలో.. ఆశ అనే దీపాన్ని పెట్టుకొని తోవ వెతుక్కుంటూ బయలుదేరిన తనను.. తెలంగాణ ప్రజలు ఎంతగా ఆదరించింది.. ఆరాధించింది.. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్న విషయాన్ని పదే పదే చెబుతుంటారు.

అలాంటి వ్యక్తి నిజంగా.. తన అనుభవాల్ని రాస్తే.. ఒక ఉద్యమాన్ని ఎలా నిర్మించాలి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలి..? ఎలా సాధించాలన్న విషయాలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇవ్వటమే కాదు.. మరిన్ని ఉద్యమాలు పుట్టటానికి కారణమైనా ఆశ్చర్యం లేదు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తల్లో కేసీఆర్‌ తన అనుభవాల గురించి ఒక పుస్తకం రావాలని భావించారని అయితే.. పని ఒత్తిడితో ఆ అంశాన్ని పక్కన పడేశారని.. తాజాగా మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. విద్యాసాగర్‌రావు తన మాటలతో కేసీఆర్‌ మదిలో కొత్త ఆలోచన నాటినట్లుగా చెబుతున్నారు. మరి.. పుస్తకం రాసే అంశం ఎంతమేరకు సాకారం అవుతుందో చూడాలి.