Begin typing your search above and press return to search.

తమిళుల లెక్క తేల్చనున్న ‘తెలుగోడు’

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:31 AM GMT
తమిళుల లెక్క తేల్చనున్న ‘తెలుగోడు’
X
ఈ మాట పూర్తిగా అర్థం కావాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. ఏపీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రోళ్లు పలువురు తమిళులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. రాష్ట్ర విభజన విషయంలో తమిళ నేత తమ తలరాతను ఎలా రాస్తారంటూ ప్రశ్నించేవారు. విభజనకు సంబంధించి నాడు సోనియమ్మ ఏర్పాటు చేసిన కమిటీలో ఒక్కడంటే ఒక్క తెలుగోడు లేడని.. తమిళుడ్ని మాత్రం పెట్టారంటూ చిదంబరాన్ని ఉద్దేశించి ప్రస్తావించేవారు.

అంతేకాదు.. తమిళ నేతలకు తెలుగువారు ఐక్యంగా ఉండటం ఇష్టం ఉండదని.. విభజనతో చీలిపోతే.. తాము తిరుగులేని విదంగా ఉంటామన్న భావన వారిలో ఎక్కువన్న విమర్శలు వచ్చేవి. అయితే.. ఈ తరహా మాటల్లో నిజాలు ఎంతన్నది పక్కన పెడితే.. తెలుగోళ్ల విషయంలో తమిళుడు లెక్క తేల్చేదేమిటన్న ఆగ్రహం మాత్రం కనిపించేది.

ఇలాంటి వాదనను వినిపించే వారంతా ఇప్పుడు కాస్తంత హ్యపీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. తమిళనాడులో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తీసుకురానుంది.. తమిళనాట సీఎంగా ఎవరన్నది తేల్చే కీలక బాధ్యత ఒక తెలుగోడి మీద ఉండటం మర్చిపోకూడదు. మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్ రావు.. తమిళనాడుకు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభంలో గవర్నర్ పాత్ర ఎంత కీలకమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తమిళుల పంచాయితీని ఒక తెలుగువాడు తీర్చాల్సి రావటం చూస్తే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న భావన కలుగుతుంది. తెలుగోళ్ల యవ్వారంలో తమిళ నేత జోక్యం ఏమిటని ఫీలయ్యే తెలుగువారి మాదిరే.. ఇప్పటి పరిణామాల వేళ.. తమిళుల్లో అలాంటి ఫీలింగ్ కనిపించకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/