Begin typing your search above and press return to search.

సంజయ్ కు షాకిచ్చిన విద్యాసాగర్

By:  Tupaki Desk   |   24 Sep 2015 12:14 PM GMT
సంజయ్ కు షాకిచ్చిన విద్యాసాగర్
X
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారిని చూసి చాలామంది అసూయ పడుతుంటారు కానీ.. ఆయా స్థానాల్లో ఉండే ఒత్తిడి.. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎంతటి సంఘర్షణ ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. అత్యుత్తమ స్థానాల్లోని వారు తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నమోదు కావటమే కాదు.. వారి పేరు ప్రతిష్ఠలపైనా విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో తీసుకునే నిర్ణయాలు వారి సమర్థతకు కొలమానంగా చూపిస్తాయి.

ప్రముఖుల విషయంలో చట్టం చుట్టంలా వ్యవహరిస్తుందన్న వాదనకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను కొట్టి పారేసి వార్తల్లోకి వచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదిగా పలువురు అభివర్ణిస్తున్నారు.

1993లో చోటు చేసుకున్న ముంబయి బాంబు పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణ నిరూపితమై సంజయ్ దత్ కు జైలుశిక్షను విధించటం తెలిసిందే. జైలుశిక్షను అనుభవిస్తూ.. మధ్య మధ్యలో పెరోల్ మీద బయటకు వస్తున్న ఆయన.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని జైలు జీవితం నుంచి విముక్తినివ్వాలంటూ రెండున్నరేళ్ల కిందట దరఖాస్తు పెట్టుకున్నారు.

కోర్టు విధించిన జైలు శిక్ష మామూలుగా అయితే 2016 ఫిబ్రవరిలో పూర్తి కానుంది. అయితే.. ఆయన పెట్టుకున్న దరఖాస్తు ఇప్పటివరకూ ముందుకెళ్లలేదు. ఈ నేపథ్యంలో.. ఈ మధ్యనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర సర్కారు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కు దరఖాస్తును పంపింది. దీన్ని పరిశీలించిన ఆయన.. సంజయ్ కు క్షమాభిక్ష ప్రసాదించేది లేదంటూ.. ఆయన పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. ఒక ప్రముఖ వ్యక్తికి చెందిన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించటం ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై కాస్తంత సానుకూలత వ్యక్తమై.. ముందే బయటకు రావొచ్చన్న ఆశతో ఉన్న సంజయ్ కు ఈ పరిణామం కాస్త ఇబ్బంది కలిగించేదే అన్న వాదన వినిపిస్తోంది.