Begin typing your search above and press return to search.

విశ్వభారతి ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రేం జరిగింది?

By:  Tupaki Desk   |   23 May 2023 2:00 PM GMT
విశ్వభారతి ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రేం జరిగింది?
X
జాగారం అన్నంతనే శివరాత్రి గుర్తుకు వస్తుంది. రాత్రంతా నిద్ర పోకుండా అధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అయితే.. ఇప్పుడు చెప్పేది మాత్రం రాజకీయ జాగారంగా దీన్ని చెప్పాలి. కర్నూలు పట్టణంలోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణం. వైసీపీ ఎంపీ అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం బారిన పడటంతో ఆమెను హైదరాబాద్ కు తీసుకొస్తూ.. మార్గమధ్యలోనే రూటు మార్చి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావటం.. అక్కడే ఆమెకు చికిత్స చేయిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేయటం.. ఎప్పటికప్పుడు విచారణకు వెళ్లకుండా.. తనకున్న వ్యక్తిగత పనుల్ని చెబుతూ గైర్హాజరు కావటం తెలిసిందే. ఇలాంటి వేళలో సోమవారం పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు రావటం.. స్పెషల్ పోలీసులతో అక్కడి పరిసర ప్రాంతాలన్ని నిండిపోవటంతో పాటు.. అవినాశ్ అరెస్టు తథ్యమన్న మాట వినిపించింది.

ఇలాంటి వేళలో.. సీబీఐ అధికారులు కాస్తంత దూకుడుగా వ్యవహరించినట్లే కనిపించి.. ఆ వెంటనే వెనక్కి తగ్గిన వైనం కనిపించింది. రెండు టీంలుగా వచ్చిన సీబీఐ అధికారుల్లోని ఒక టీం సోమవారం రాత్రి హైదరాబాద్ కు వెళ్లిపోగా.. మరో టీం మాత్రం పోలీసుల రెస్టు రూంలో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అవినాశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై బుధవారం సుప్రీంలో విచారణ జరగనుంది. మరోవైపు.. సోమవారం రాత్రంతా విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఎంపీ అవినాశ్ అభిమానులు.. ఆయన ఫాలోవర్లు పెద్ద ఎత్తున జాగారం చేయటం కనిపించింది.

మొత్తానికి అవినాశ్ ను అదుపులోకి తీసుకోవటం అంత తేలికైన విషయం కాదన్నట్లుగా పరిస్థితులు మారటం గమనార్హం. సోమవారం రాత్రంతా ఆసుపత్రి వద్దనే ఉండటం.. నిద్ర పోకుండా ఎవరైనా వస్తారా? అన్నట్లు వెయిట్ చేయటం కనిపించింది. అంతేకాదు.. అక్కడే భోజనాలు.. టిఫిన్లు చేయటం కనిపించింది. ఇందులో భాగంగా రోడ్డు మీదనే క్లాత్ కార్పెట్లను వేసుకొని ఉండటం.. రోడ్లకు అడ్డంగా కార్లను నిలిపేశారు. ఒకవేళ.. ఎంపీ అవినాశ్ ను అదుపులోకి సీబీఐ అధికారులు తీసుకున్నా.. అక్కడి నుంచి తరలించేందుకు వీల్లేని రీతిలో పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనికి సీబీఐ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.