Begin typing your search above and press return to search.

ఎస్ బీఐని ఆడేసుకుంటున్న మాల్యా!

By:  Tupaki Desk   |   20 April 2019 5:27 AM GMT
ఎస్ బీఐని ఆడేసుకుంటున్న మాల్యా!
X
ఒక దొంగ ద‌ర్జాగా పోలీసు శాఖ‌ను త‌ప్పు ప‌ట్ట‌గ‌ల‌రా? త‌ప్పు చేసి.. తాను చేసిన త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని చెబుతూనే.. మ‌రోవైపు పోలీసుల లోపాల్ని.. వైఫ‌ల్యాల్ని ఎత్తి చూపే వైనాన్ని ఇప్ప‌టివ‌రకు ఎప్పుడైనా చూశారా? అంటే లేద‌ని చెబుతారు ఎవ‌రైనా. కానీ.. తాజాగా కింగ్ ఫిష‌ర్ మాల్యా ఎపిసోడ్ ను చూసిన‌ప్పుడు మాత్రం ఈ విష‌యం ఇట్టే అర్థమ‌వుతుంది.

ఆర్థిక నేర‌గాడిగా.. వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల‌కు ఎగ్గొట్టి బ్రిట‌న్ లో విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న విజ‌య్ మాల్యా.. గ‌డిచిన కొద్దికాలంగా బ్యాంకుల‌తో పాటు..కొన్ని వ్య‌వ‌స్థ‌ల్ని ట్వీట్ల‌తో టార్గెట్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న ఎత్తి చూపుతున్న అంశాల్ని సింఫుల్ గా తీసుకోవ‌టానికి లేద‌నే చెప్పాలి.

తాను అప్పు చేసిన మాట నిజ‌మే కానీ.. ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లిస్తాన‌ని చెప్పినా బ్యాంకులు ప‌ట్టించుకోకుండా ఉండ‌టాన్ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని.. తిరిగి చెల్లించ‌టంలో డీఫాల్ట్ అయిన‌ప్పుడు వారిపైన చ‌ర్య‌లు తీసుకుంటారు. అలాంటిది ప్రాసెస్ లో ఉన్న‌ప్పుడు.. తాను చేసిన అప్పును తిరిగి చెల్లిస్తాన‌ని చెబితే.. వెంట‌నే ఇష్యూ సెటిల్ చేసుకోవ‌టం క‌నిపిస్తుంది. కానీ.. మాల్యా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.

తాను తిరిగి చెల్లిస్తాన‌న్న డ‌బ్బుల గురించి మాట్లాడ‌ని బ్యాంకులు.. త‌న‌ను ఇండియాకు తెప్పించేందుకు బ్యాంకు లాయ‌ర్లు చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని చెబుతూ.. కొత్త అనుమానాల‌కు తెర తీశారు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్లు ఎస్ బీఐ బ్యాంకుకు ఊపిరి ఆడ‌న‌ట్లుగా చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న‌ను భార‌త్ కు ర‌ప్పించ‌టానికి ఎస్ బీఐ లాయ‌ర్లు ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో తెలుసా? అంటూ ట్వీట్ చేశారు. లండ‌న్ లోని బ్యాంకులో ఉన్న 2,60,000 పౌండ్ల‌ను మాల్యా వినియోగించుకోకుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులుఇవ్వాల‌ని ఎస్ బీఐ నేతృత్వంలోని బ్యాంకు క‌న్సార్టియం యూకే లోని హైకోర్టును కోరింది. అయితే.. ఆ విన్న‌పాన్ని రిజెక్ట్ చేశారు న్యాయ‌మూర్తి. ఇదిలా ఉండ‌గా.. ఎస్ బీఐ మీద త‌న విమ‌ర్శ‌ల ట్వీట్ల‌ను పెంచేస్తున్న మాల్యా తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర ట్వీట్లు చేశారు.

భార‌త్ లో ప‌న్నులు చెల్లిస్తున్న వారి సొమ్ముతో ఎస్ బీఐ న్యాయ‌వాదులు ఇక్క‌డ త‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జెంటేష‌న్లు ఇస్తున్నార‌ని.. భార‌తీయుల సొమ్ముతో ఎస్ బీఐ లాయ‌ర్లు యూకేలో త‌మ‌కు తాము ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. దీనికి వారు స‌మాధానం చెప్పాల్సిందేన‌న్నారు. మీడియాకు సంచ‌ల‌న వార్త‌లు కావాల‌ని.. అయితే ఎవ‌రూ కూడా ఎస్ బీఐ నేతృత్వంలోని క‌న్సార్టియం చేస్తున్న ఖ‌ర్చుల లెక్క మీద రైట్ టు ఇన్ ఫ‌ర్మేష‌న్ యాక్ట్ కింద ఎందుకు అడ‌గ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తాన‌ని చెప్పినా ఎందుకు విన‌టం లేద‌ని ప్ర‌శ్నిస్తున్న మాల్యా మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్సిస్తున్నాయి. మొండి బాకీల విష‌యంలో ముందు వ‌చ్చినంత మొత్తాన్ని తిరిగి తీసుకోవ‌టం.. ఆ త‌ర్వాత న్యాయ‌పోరాటం చేస్తుంటారు. కానీ.. మాల్యా ఎపిసోడ్ లో బ్యాంకుల తీరు కాస్త తేడాగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మాల్యా నుంచి రావాల్సిన మొత్తానికి మించి ఎస్ బీఐకి క‌వాల్సిందేమిటి?