Begin typing your search above and press return to search.
ఈడీ దెబ్బకు భారత్ కు రానున్న మాల్యా!
By: Tupaki Desk | 26 Jun 2018 1:55 PM GMT2016లో లిక్కర్ కింగ్ - కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా....భారత్ లోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్లు ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు వేల కోట్ల శఠగోపం పెట్టిన మాల్యా ఎంచక్కా లండన్ చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, 'పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్' కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని ఈడీ డిమాండ్ చేసింది. మాల్యాకు చెందిన దాదాపు రూ.13 వేల కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ముంబై కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ఈ చర్యతో షాక్ తిన్న మాల్యా దెబ్బకు దిగి వచ్చాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తానని, బకాయి పడ్డ 13 వేల కోట్లను చెల్లిస్తానని లండన్ లోని మీడియా వర్గాల ద్వారా మాల్యా స్వయంగా ప్రకంటించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి - ఈడీ ఎత్తులకు మాల్యా చిత్తయ్యాడు. దీంతో, మాల్యా బారిన పడ్డ బాధిత బ్యాంకులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి.
కేంద్రం - ఈడీ ఒత్తిడికి మాల్యా చిత్తయ్యాడు. చివరకు తాను తీసుకున్న రుణాలన్నింటిని చెల్లించడానికి అంగీకరించాడు. అయితే, తాను భారత్ కు రాబోతోన్న విషయాన్ని వెల్లడించిన మాల్యా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకు తెలిపాడు. తాను ఎగ్గొట్టిన సొమ్ములపై మాల్యా వాదన మరోలా ఉంది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నానని, ఈ లోపే రాజకీయ స్వప్రయోజనాల కోసం తనను 9 వేల కోట్లు దోచుకెళ్లిన దొంగలా చిత్రీకరించారని - దానికి నేను బాధ్యుడిని కాదని అన్నారు. తన సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా తాను ప్రయత్నించానని - కానీ కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నందును చెల్లింపులు కుదరలేదని వివరించారు. తనపై కేంద్రం - ఈడీ తీసుకుంటున్న క్రిమినల్ చర్యలతో విసిగిపోయానని మాల్యా అన్నాడు. ఈ కేసులో ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మాల్యా ఆరోపించాడు. తన రుణాలకు సంబంధించి 2016లోనే ప్రధాని నరేంద్ర మోడీ - ఆర్థిక మంత్రి జైట్లీకి రెండు లేఖలు రాసినట్టు తెలిపారు. అయితే, ఆ లేఖలకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని మాల్యా తెలిపాడు. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా తిరిగిరానుండ...ఓ రకంగా భారతీయుల విజయమని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో...మీడియాలో కూడా మాల్యాపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మండిపడడంతో మాల్యా భారత్ కు రాక తప్పడం లేదు.
9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన మాల్యా....మొదట్లో తనకు భారత్ తో పనిలేదన్నట్లుగా మాట్లాడారు. తన ఎఫ్ వన్ రేస్ టీమ్ పేరు నుంచి యూడా భారత్ ను తొలగించారు. అయితే, మాల్యా కేసులో ఈడీ ముమ్మురంగా విచారణ చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది.
కొసమెరుపు - అయితే మాల్యా ప్రకటన వెనుక చాలా రాజకీయం ఉన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నో స్కాములు జరిగినా విజయ్ మాల్యా వల్ల బీజేపీ-మోడీ సర్కారుకు చాలా డ్యామేజీ జరిగింది. సామాన్యుడికి ఫ్రస్ట్రేషన్ వచ్చినపుడల్లా మాల్యా వంటి వారిని వదిలేస్తారు సామాన్యులను వేధిస్తారా? అని ప్రశ్నించడం చాలా కామన్ అయిపోయింది. గతంలో బాగా చదువుకున్న ఒక మహిళ టిక్కెట్ లేకుండా రైల్లో ప్రయాణించి పోలీసులు పట్టుకుని కోర్టులో ప్రవేశ పెడితే... మాల్యా నుంచి వసూలు చేస్తేనే నేను ఫైన్ కడతాను, జైలుకెళ్లడానికైనా సిద్ధం కానీ జరిమానా కట్టను అని కోర్టులో తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల విషయంలో మాల్యా వల్ల డబ్బు కంటే పరపతి డ్యామేజ్ ఎక్కువగా జరిగిన నేపథ్యంలో... ఇమేజ్ కోసం మోడీ సర్కారు మాల్యాను బుజ్జగించి లోను వసూలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి మరి!