Begin typing your search above and press return to search.

పారిపోలేదంట.. జస్ట్ బిజినెస్ కోసం వెళ్లాడంట

By:  Tupaki Desk   |   11 March 2016 6:19 AM GMT
పారిపోలేదంట.. జస్ట్ బిజినెస్ కోసం వెళ్లాడంట
X
రూ.9వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయి.. దేశం విడిచి జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాజాగా సంచలన ట్వీట్లు చేశాడు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు తన సమాధానంగా ఆయన బదులిచ్చే ప్రయత్నం చేశారు. తానేమీ పారిపోలేదని.. వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లినట్లుగా ఆయన చెప్పుకున్నారు. వివిధ బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని.. వాటిని ఎగవేసి దేశం నుంచి పారిపోయినట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటంతో పాటు.. ఆయనపై పార్లమెంటులో చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

తాను ఎక్కడికి పారిపోలేదన్న మాల్యా.. చట్టానికి కట్టుబడి ఉంటానని శుక్రవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్లు చేశారు. తనపై మీడియా బురద జల్లుతుందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానొక అంతర్జాతీయ వ్యాపారవేత్తనని.. రుణఎగవేత దారుడిని కాదన్న ఆయన.. విదేశాలకు వెళ్లటం తనకేం కొత్తకాదని.. తనపై దేశం నుంచి పారిపోయినట్లుగా పుకార్లు సృష్టిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నాడు.

చట్టాల్ని గౌరవిస్తానని.. వ్యాపారానికి.. బ్యాంకు రుణాలకు సంబంధించిన వ్యవహారాల్ని చట్టపరంగానే ఎదుర్కొంటానంటూ మాల్యా తన ట్వీట్లలో పేర్కొన్నాడు. ఇన్ని విషయాలు చెప్పిన మాల్యాకు చట్టం మీద నిజంగానే గౌరవం ఉంటే.. తాను ఎక్కడ ఉన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. తాను ఎప్పుడు దేశానికి వస్తున్న విషయాన్ని మాల్యా ఎందుకు వెల్లడించనట్లు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించకపోవటం గమనార్హం.