Begin typing your search above and press return to search.

మాల్యా డ‌బ్బులు ఇస్తాన‌న్నా బ్యాంకులు తీసుకోవ‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   17 April 2019 2:30 PM GMT
మాల్యా డ‌బ్బులు ఇస్తాన‌న్నా బ్యాంకులు తీసుకోవ‌ట్లేద‌ట‌
X
అంద‌రూ ఒకేలా ఉండ‌ర‌న్న‌ట్లుగా కింగ్ ఫిష‌ర్ విజ‌య్ మాల్యా పెడుతున్న ట్వీట్లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అప్పులు పెరిగిపోయి కింగ్ ఫిష‌ర్ ను మూసివేయ‌టం.. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల్ని చెల్లించ‌కుండా విదేశాల‌కు పారిపోయిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌.. లండ‌న్ లో ఉన్న విష‌యం తెలిసిందే. విలాస‌వంత‌మైన జీవితాన్ని గడుపుతూ అప్పుడ‌ప్పుడు చురుకు త‌గిలే ట్వీట్లు చేసే మాల్యా.. తాజాగా జెట్ ఎయిర్ వేస్ దీన ప‌రిస్థితిపైన విచారం వ్య‌క్తం చేశారు.

జెట్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై మాల్యా స్పందిస్తూ.. ఒక‌ప్పుడు పెద్ద ప్రైవేటు ఎయిర్ లైన్స్ ఇప్పుడీ స్థితిలో చూడాల్సి రావ‌టం బాధాక‌రంగా పేర్కొన్నారు. ఒక‌ప్పుడు త‌మ కింగ్ ఫిష‌ర్.. జెట్ మ‌ధ్య పోటీ ఉండేద‌ని గుర్తు చేశారు. తాము పోటీదారుల‌మే అయిన‌ప్ప‌టికీ.. న‌రేవ్ గోయ‌ల్ దంప‌తుల ప్ర‌స్తుత ప‌రిస్థితిపై తాను సానుభూతి తెలుపుతున్న‌ట్లుగా చెప్పారు.

జెట్ కోసం వారెంతో క‌ష్ట‌ప‌డిన‌ట్లుగా పేర్కొన్న మాల్యా.. ప్రైవేటు విమాన‌యాన సంస్థ అన్న ఒక్క కార‌ణంతో ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తుంద‌ని.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను బ‌య‌ట‌ప‌డేసేందుకు రూ.35 వేల కోట్లు ఇచ్చిన ప్ర‌భుత్వం.. ప్రైవేటు సంస్థ‌ల్ని ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నారు. జెట్ తాజా ప‌రిస్థితికి ప్ర‌భుత్వ‌మే కార‌ణంగా ఆయ‌న ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ ప్ర‌స్థానాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు తెచ్చుకున్నారు. తాను కింగ్ ఫిష‌ర్ లో భారీగా పెట్టుబ‌డులు పెట్టాన‌ని.. కొద్దికాలంలోనే దేశంలోనే అతి పెద్ద విమాన‌యాన సంస్థ‌గా ఎదిగింద‌ని.. ఆ కొద్ది కాలంలో ఎయిర్ లైన్స్ వేగంగా అభివృద్ధి చెందిన వైనాన్ని ప్ర‌స్తావించారు. ఎన్నో అవార్డులు వ‌చ్చాయ‌ని.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవ‌టం నిజ‌మే అయినా.. వాటిని తాను తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

అయితే.. తాను రుణాలు చెల్లిస్తాన‌ని చెప్పిన ప్ర‌తిసారీ.. మీడియా న‌న్ను భార‌త్ కు అప్ప‌గించే విష‌యం మీద‌నే మాట్లాడుతుంద‌ని.. తాను డ‌బ్బులు ఇస్తాన‌ని చెప్పినా బ్యాంకులు తీసుకోవ‌టం లేద‌న్నారు. తాను లండ‌న్ లో ఉన్నా.. జైల్లో ఉన్నా తాను అప్పు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అప్పును తిరిగి చెల్లిస్తాన‌ని మాల్యా చెప్పినా.. బ్యాంకులు ఎందుకు తీసుకోవ‌టం లేద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. దానికి స‌మాధానం చెప్పేదెవ‌రు?