Begin typing your search above and press return to search.

మాల్యా భ‌లే ట్విస్ట్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   9 Sep 2016 9:37 AM GMT
మాల్యా భ‌లే ట్విస్ట్ ఇచ్చారే!
X
కింగ్ ఫిష‌ర్ అధినేత‌ - వేల కోట్ల రూపాయ‌ల‌కు బ్యాంకుల‌ను బురిడీ కొట్టించి దేశం నుంచి ప‌రారైన విజ‌య్ మాల్యా తాజాగా భ‌లే ట్విస్ట్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక ఎట్టిప‌రిస్థితిలోనూ భార‌త్‌ కు వ‌చ్చేది లేద‌ని తేల్చి చెప్ప‌డ‌మే కాకుండా.. త‌న గురించి ఎక్స్‌ట్రాలు రాస్తున్న మీడియా ప్ర‌తినిధులు ఒక‌ప్పుడు తానిచ్చిన విందుల కోసం చొంగ‌కార్చుకుని తిరిగార‌ని కూడా కామెంట్లు చేశారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న దేశానికి వ‌చ్చేందుకు తానెంత‌గానో ఎదురు చూస్తున్నాన‌ని ఓ క్రేజీ కామెంట్ చేశారు. అంతేకాదు, భార‌త ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన త‌న పాస్ పోర్టును పున‌రుద్ధ‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. పాస్‌ పోర్టు లేక‌పోవ‌డం వ‌ల్లే తాను భార‌త్‌ కు రాలేక‌పోతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌న పాస్ పోర్టును పున‌రుద్ధ‌రించేలా చూడాల‌ని కోరుతూ ఢిల్లీ లోని పాటియాలా కోర్టుకు మాల్యా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో 2000 సంవ‌త్స‌రం నాటి ఫెరా ఉల్లంఘ‌న కేసును కూడా ఉప‌సంహ‌రించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించిన‌ట్టు స‌మాచారం. మ‌రి మాల్యా అభ్య‌ర్థ‌న‌ల‌పై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, విజ‌య్ మాల్యాపై దేశ వ్యాప్తంగా పలు కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా మాల్యా విష‌యంలో రంగంలోకి దిగిన ఈడీ.. ఆయ‌న ఆస్తుల‌ను గుర్తించి జ‌ప్తు చేయ‌డం ప్రారంభించింది. ఈ లిక్కర్ కింగ్ కు సంబంధించిన రూ.6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ ఏ) ప్రకారంగా అలీబాగ్ వద్ద ఉన్న రూ.25 కోట్ల విలువైన భవంతితోపాటు బెంగళూరులో రూ.565 కోట్ల విలువైన కింగ్‌ ఫిషర్ టవర్ - రూ.800 కోట్ల విలువైన మాల్ - అపార్ట్‌ మెంట్లు - పలు బ్యాంకుల్లో ఉన్న రూ.10 కోట్ల విలువైన ఫిక్స్‌ డ్ డిపాజిట్లు - యూఎస్‌ ఎల్ - యునైటెడ్ బ్రెవరేజ్ లిమిటెడ్ - మెక్‌ డోనాల్డ్ హోల్డింగ్ కంపెనీ - యూబీహెచ్‌ ఎల్‌ లో ఉన్న వాటాలను ఈడీ అటాచ్ చేసింది. వీటి నికర విలువ రూ.3,635 కోట్లు. 2010లో విలువ ఆధారంగా సంస్థకు చెందిన రూ.4,234.84 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు అయింది.

ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ రూ.6,630 కోట్ల స్థాయిలో ఉంది. మ‌రోప‌క్క‌, ముంబాయిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేప‌థ్యంలోనే మాల్యా త‌న‌కు భార‌త్ రావాల‌ని ఉంద‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం - దీనికి సంబంధించి కోర్టు ద్వారా లైన్ క్లియ‌ర్ చేయించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.