Begin typing your search above and press return to search.

ఎవరిని సపోర్ట్ చేయనని యువ హీరో తేల్చేశాడు

By:  Tupaki Desk   |   10 May 2016 5:09 AM GMT
ఎవరిని సపోర్ట్ చేయనని యువ హీరో తేల్చేశాడు
X
పాలిటిక్స్ కు సినిమా తారలకు మధ్య నున్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న సినిమా నటీనటుల్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వినియోగించటం కొత్త కాదు. కాకుంటే.. ఎన్నికల సందర్భంగా రాజకీయాల జోలికి వెళ్లని నటీనటులు.. తమ ప్రస్తావన ఎక్కడా రాకుండా ఉంటే చాలని అనుకుంటారు. తమ ప్రస్తావన వచ్చి.. అందుకు భిన్నంగా తాను రియాక్ట్ అయితే లేనిపోని ఇబ్బందులు ఎందుకన్న భావన సినిమా నటుల్లో కనిపిస్తుంది.

కానీ.. అలాంటి మొహమాటాలకు గురి కాకుండా ఓపెన్ గా తన వైఖరిని చెప్పేసి.. తన స్టైలే వేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తమిళనాడు యువ హీరో విజయ్. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి అభిమానులున్న ఏకైక హీరో విజయ్ మాత్రమే. అలాంటి విజయ్ ఇమేజ్ ను వాడుకోవాలని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో.. విజయ్ తరఫున ఒక ప్రకటన వెలువడింది.

తాజా ఎన్నికల్లో తాను ఏపార్టీకి మద్దతు తెలపటం లేదని.. తాను మధ్యంతరంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తేల్చేసిన విజయ్.. తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటం లేదని తేల్చేశారు. తాను మద్దతు ఇస్తున్నట్లు ఎవరైనా ప్రచారం చేస్తే నమ్మొద్దని ఆయన చెబుతున్నారు. ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చని.. తన పేరును ఎవరూ వాడుకోకూడదని.. ఒకవేళ ఏ పార్టీ అయినా తన పేరును వాడుకుంటే మాత్రం తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెబుతున్నాడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఇంత విస్పష్టంగా తేల్చేయటం చూస్తే.. విజయ్ కు ధైర్యం ఎక్కువనే చెప్పక తప్పదు.