Begin typing your search above and press return to search.

విజ‌య్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   7 Feb 2018 10:35 AM GMT
విజ‌య్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నాడా?
X
పుర‌చ్చి త‌లైవి - త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం అక్క‌డి రాజకీయాలు ఒక్క‌సారిగా ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. `అమ్మ`.... పోయాక అన్నా డీఎంకేలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు - సీఎం కుర్చీ కోసం కుస్తీలు - చిన్న‌మ్మ జైలుకు వెళ్ల‌డం - ఆర్కేన‌గ‌ర్ లో దిన‌క‌ర‌న్ విజ‌యం - అదే నియోజ‌క‌వ‌ర్గంలో విశాల్ నామినేష‌న్ తిరస్క‌ర‌ణ‌ - త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ - విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ అరంగేట్ర ప్ర‌క‌ట‌న‌లు....వంటి ప‌రిణామాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. త‌మిళ‌నాడులో సినీ - రాజ‌కీయ రంగాల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. ఎంజీఆర్ నుంచి మొద‌లుకొని ర‌జ‌నీ వ‌ర‌కు....సినీ తార‌ల హ‌వా న‌డుస్తూనే ఉంది. తాజాగా, మ‌రో ప్ర‌ముఖ‌ నటుడు రాజ‌కీయ అరంగేట్రానికి రంగం సిద్ధ‌మ‌వుతున్నట్లు తెలుస్తోంది. ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతోన్న‌ట్లు ఆయ‌న అభిమానులు సంకేతాలిస్తుండ‌డం త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

విజ‌య్ రాజకీయ రంగప్రవేశంపై త‌మిళ‌నాడులో హాట్ హాట్ గా చ‌ర్చ చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం విజ‌య్ న‌టించిన `మెర్సల్` చిత్రంపై బీజేపీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ గ‌తంలోనే విజయ్ రాజకీయ అరంగేట్రంపై ఆయన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. విజయ్ అభిమాన సంఘం..... ప్రజాసంఘంగా మారి అనేక సేవా కార్యక్రమాలు చేప‌ట్టింది. రజనీ, కమల్ అభిమానులు వెబ్ సైట్ ను ప్రారంభించి ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకుంటున్నారు. అదే క్ర‌మంలో విజయ్ అభిమానులు ‘విజయ్‌ ప్రజా సంఘం’ పేరుతో ఓ వెబ్‌ సైట్‌ ప్రారంభించారు. విజ‌య్ అభిమానులు, ప్రజలను అందులో సభ్యులుగా చేర్చ‌డం ప్రారంభించారు. విజ‌య్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్న నేప‌థ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొద‌లుపెట్టామ‌ని విజ‌య్ అభిమానులు చెబుతున్నారు. అయితే, తాను రాజ‌కీయాల్లోకి రాబోతోన్న‌ట్లు విజ‌య్ నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ‌లేదు.