Begin typing your search above and press return to search.

పదవిపై మోజు పరువు తీసేసింది!

By:  Tupaki Desk   |   31 July 2017 5:06 AM GMT
పదవిపై మోజు పరువు తీసేసింది!
X
అసలే ఆయన మామూలు నాయకుడు కాదు.. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. దేవుడి కంటె పూజారి బలమైన వాడు అనే నీతి నిజమే అయితే గనుక.. సోనియా కంటె సోనియా వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన ఎంతో బలమైన నాయకుడు... ఆయనే అహ్మద్ పటేల్! ఆయన ఇప్పటికి వరుసగా ఆరుసార్లుగా రాజ్యసభ ఎంపీ అవుతున్నారు. సోనియా విధేయుడు గనుక తిరుగులేకుండా గడచిపోతోంది. ఇప్పుడు మళ్లీ ఎంపీ కాదలచుకుంటున్న ఆయన గుజరాత్ రాజ్యసభ ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాకపోతే.. ఇక్కడ తమ సొంత పార్టీ ఓట్లు కూడా పడతాయో లేదో అని భయపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాదాపు కిడ్నాప్ చేసిన రేంజిలో బెంగుళూరుకు తరలించి.. అక్కడ క్యాంపు నిర్వహిస్తోంది.

కాకపోతే.. అహ్మద్ పటేల్ కు పదవి కట్టబెట్టడానికి కాంగ్రెస్ పడుతున్న ఈ తాపత్రయం ఆ పార్టీ పరువు తీసేస్తోంది. ఎందుకంటే గుజరాత్ ఇప్పుడు తీవ్రమైన వరదలతో అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు సహజంగా తమ తమ నియోజకవర్గాల్లో ఉండి ప్రజలకు అండగా, వారికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు పనిచేస్తూ ఉండాలి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగుళూరు రిసార్టులో కూర్చుని విలాసాల్లో మునిగి తేలుతున్నారు.

సరిగ్గా ఈ పాయింటును గుజరాత్ లో అధికారంలో ఉన్న భాజపా చక్కగా వాడుకుంటోంది. ఆ మాత్రం బాధ్యత లేకుండా పదవీ దాహంతో ప్రజలకు సేవ పట్ల బాధ్యతలేకుండా వరదల సమయంలో ఈ ఎన్నికల క్యాంపేమిటి అంటూ సిఎం విజయ్ రూపానీ అంటున్నారు. నిజంగా దీనికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నీళ్లు నమిలే పరిస్థితి. కాకపోతే.. కాంగ్రెస్ జాతీయ నాయకులు మాత్రం.. ఏదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు బెంగుళూరు శిబిరంలో ఉన్నప్పటికీ కూడా.. తమ అనుచరులను సహాయకార్యక్రమాల్లో నిమగ్నం చేశారంటూ ఏదో డొంక తిరుగుడు కబుర్లు చెబుతున్నారు.

అయితే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైఖరిపై అసహనం పెరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు వారి విలాసాలు, క్యాంపులు ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. అసలే గుజరాత్ లో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడంతో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఈ చర్యతో మరింత పరువు పోగొట్టుకునేలా తయారైంది.