Begin typing your search above and press return to search.

మోడీకి షాకిచ్చే దిశ‌గా గుజ‌రాత్ ప‌రిణామాలు

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:53 AM GMT
మోడీకి షాకిచ్చే దిశ‌గా గుజ‌రాత్ ప‌రిణామాలు
X
రాజ‌కీయం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని అంద‌రూ చెప్పేదే. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే గుజ‌రాత్ లో చోటు చేసుకోనుందా? అంటే అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఒక్క‌సారి అలెర్ట్ అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. మోడీ షా ద్వ‌యానికి దిమ్మ తిరిగిపోయేలా మారే అవ‌కాశం ఉందంటున్నారు. 22 ఏళ్ల అధికారాన్ని నిలుపుతూ.. ముక్కుతూ.. ములుగుతూ గుజ‌రాత్ రాష్ట్రంలో మ‌రోసారి విజ‌యాన్ని సాధించింది బీజేపీ.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన సీట్ల‌కు కేవ‌లం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే అధికంగా ఉన్నారు. 22 ఏళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని అనుభ‌వించిన త‌ర్వాత పాల‌క పక్షానికి ఆ మాత్రం మెజార్టీ రావ‌టం మాట‌లా? అని ప్ర‌శ్నించే వారు ఉన్నారు. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం కొలువు తీరి మూడు రోజులు కూడా కాక ముందే అస‌మ్మ‌తి ఇప్పుడు చాప‌కింద నీరులా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీకి.. ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ కు మ‌ధ్య పొడ‌చూపిన విభేదాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని.. అవి తీవ్ర రూపం దాలుస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ప‌ద‌వులు ఓకే అయినా.. ఉప ముఖ్య‌మంత్రిగా గ‌తంలో తాను నిర్వ‌హించిన కీల‌క శాఖ‌ల్ని కేటాయించ‌కుండా తూతూ మంత్రంగా ఉండే శాఖ‌ల్ని కేటాయించ‌టంపై నితిన్ ప‌టేల్ అల‌క‌బూనిన‌ట్లు చెబుతున్నారు. గ‌తంలో ఆర్థిక‌.. పెట్రో కెమిక‌ల్‌.. ప‌ట్ట‌ణాభివృద్ధితో పాటు ప‌లు కీల‌క మంత్రిత్వ శాఖ‌ల్ని నిర్వ‌హించిన నితిన్ కు తాజాగా రోడ్లు.. భ‌వ‌నాలు.. ఆరోగ్యంతో పాటు మ‌రో శాఖ‌ను మాత్ర‌మే కేటాయించ‌టంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో.. త‌న‌కు గ‌తంలో కేటాయించిన శాఖ‌ల్ని కేటాయిస్తేనే.. ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని చేప‌డ‌తాన‌ని ముఖ్య‌మంత్రికి తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇందుకు ముఖ్య‌మంత్రి నుంచి సానుకూల‌త వ్య‌క్తం కాలేద‌ని తెలుస్తోంది. దీంతో.. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన బేధాభిప్రాయాలు ప్ర‌భుత్వం మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. త‌న‌కు కేటాయించిన శాఖ‌ల విష‌యంలో తేల్చుకోవాలంటూ మూడు రోజుల గ‌డువును నితిన్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగానే మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌త‌ల్ని స్వీక‌రించ‌టానికి గైర్హాజ‌రు అయిన‌ట్లుగా చెబుతున్నారు. గుజ‌రాత్ అధికార‌ప‌క్షంలో లోగుట్టుగా సాగుతున్న ఈ అసంతృప్తి జ్వాల‌ను బ‌య‌ట‌పెడుతూ ప‌టీదార్ అనామ‌త్ ఆందోళ‌న స‌మితి నేత హార్దిక్ ప‌టేల్‌చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ క‌ల‌క‌లానికి దారి తీస్తున్నాయి.

ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ తో స‌హా మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడ‌టానికి సిద్ధంగా ఉన్నారంటూ పెద్ద బాంబును పేల్చారు. వారికి కాంగ్రెస్ లో మంచి స్థానం ఇచ్చే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని వ్యాఖ్యానించారు. తాజా వ్యాఖ్య‌ల‌తో గుజ‌రాత్ లో బీజేపీ ఊహించ‌ని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఢిల్లీలో మోడీ.. షా ఉన్న క‌మ‌ల‌నాథులు అంత సాహ‌సం చేస్తారా? అన్న మాట వినిపిస్తోన్నా.. ఏమో రాజ‌కీయాల్లో అప్పుడ‌ప్ప‌డు గుర్రం ఎగ‌రావ‌చ్చు అన్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక‌వేళ అదేజ‌రిగితే దేశ వ్యాప్తంగా రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్క‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.