Begin typing your search above and press return to search.

కియాలో స్థానికులేరీ - బాబుకు విజ‌య‌సాయి రెడ్డి సూటి ప్ర‌శ్న

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:05 AM GMT
కియాలో స్థానికులేరీ - బాబుకు విజ‌య‌సాయి రెడ్డి సూటి ప్ర‌శ్న
X
కొరియా ఆటోమొబైల్ దిగ్గ‌జ సంస్థ కియా మోటార్స్ ఫ్యాక్ట‌రీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురంలో ఉత్ప‌త్తి ప్రక్రియ‌ను ప్రారంభించింది. ఇటీవ‌లే రాష్ట్రంలో తొలి కారును త‌యారు చేసింది. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు దాన్ని టెస్ట్ డ్రైవ్ చేశారు. కియాపై ప్ర‌శంస‌లు కురిపించారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టేందుకు ఈ ఫ్యాక్ట‌రీ ఊతంగా నిలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు.

అయితే - ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క కియా సంస్థలో స్థానికుల‌కు ఉద్యోగాలు ద‌క్క‌డం లేదంటూ తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత - రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కియాకు రూ.వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్టిన ప్ర‌భుత్వం లోక‌ల్స్ కు అందులో ఉద్యోగాలు ఇప్పించ‌డంలో మాత్రం విఫ‌ల‌మైందంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ సంస్థ‌లో స్థానికులు ఉద్యోగాలు చేస్తున్నారంటూ అధికార టీడీపీ నేత‌లు చెప్తున్న మాట‌లు క‌ల్పితాల‌ని ఆరోపించారు. ధ‌మ్ముంటే అనంత‌పురంలో కియా ఉద్యోగుల జాబితాను బ‌హిర్గ‌తం చేయాలంటూ సీఎం చంద్ర‌బాబు నాయుడికి స‌వాలు విసిరారు.

అనంత‌పురంలో కియా ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్టింద‌ని విజ‌య‌సాయి అన్నారు. ఆర్థిక‌ప‌రంగా భారీగా రాయితీలు కూడా క‌ల్పించింద‌ని తెలిపారు. ఇంత చేసినా కియాలో స్థానికుల‌కు ఉద్యోగాలు ద‌క్క‌క‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. ప్రభుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త నాలుగేళ్ల‌లో ఏపీలో 2 వేల మంది అన్న‌దాత బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు అధికార గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్నారు. ముఖ్య‌మంత్రి మాత్రం రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని చెప్తుండ‌టం విడ్డూరంగా ఉందంటూ దుయ్య‌బ‌ట్టారు.

ఏపీకి ప్ర‌త్యేక రాష్ట్ర హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా త్వ‌ర‌లోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌బోతున్న‌ట్లు విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు. విభ‌జ‌న‌కు ముందు పార్ల‌మెంటు సాక్షిగా హోదాపై హామీ ఇచ్చి ఆపై శీత‌క‌న్ను వేయ‌డం కార‌ణంగా రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని మోదీకి తాము వివ‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.