Begin typing your search above and press return to search.

సీఎం రమేష్ అరెస్ట్ తప్పదా.?

By:  Tupaki Desk   |   20 Oct 2018 9:57 AM GMT
సీఎం రమేష్ అరెస్ట్ తప్పదా.?
X
సీఎం రమేష్ అరెస్ట్ కాబోతున్నారనే వార్త ఢిల్లీ ఐటీ వర్గాల నుంచి లీక్ అయ్యింది. దాదాపు మూడు రోజుల పాటు ఈ టీడీపీ ఎంపీ ఇళ్లు - ఆస్తులు - కార్యాలయాలు - బంధువులు ఇళ్లపై మూకుమ్మడి ఐటీ దాడుల్లో సేకరించిన చిట్టాను క్రోడీకరించిన ఐటీ అధికారులు ఇందులో లెక్కతేలని కోట్ల రూపాయల సొమ్ము దారిమళ్లిందని గుర్తించినట్టు సమాచారం. దాదాపు ఈ సొమ్ము 100 కోట్లకు పైగానే ఉందని చెబుతున్నారు. చాలా డబ్బు కొందరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఢిల్లీలోని ఐటీ అధికారులు సీఎం రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారని.. అందుకు గల ఆధారాలు సంపాదించారని తెలుస్తోంది. సీఎం రమేష్ అక్రమాలకు పాల్పడిన ఆధారాలు ఇవేనంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వివరాలు టీడీపీ శిబిరాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ ఆధారాలు చూశాక ఖచ్చితంగా సీఎం రమేష్ జైలు పాలు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

1. సీఎం రమేష్ డైరెక్టర్ గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉత్తరాఖండ్ లోని కోటేశ్వర్ హైడ్రో ఎలక్ర్టిక్ ప్రాజెక్ట్ (400 మెగావాట్ల) స్పిల్ వే - డ్యామ్ - పవర్ హౌస్ నిర్మాణ పనులు చేపట్టింది.

2. టీడీపీ గత పాలనలో ఇదే రిత్విక్ ప్రాజెక్టు లిమిటెడ్ ను బ్లాక్ లిస్ట్ పెట్డింది.

3. టెహ్రీ డ్యామ్ కట్టిన ప్రొగెసివ్ కన్ స్ట్రక్షన్ కంపెనీకి సీఎం రమేష్ కు చెందిన సంస్థ సబ్ కాంట్రాక్టర్ గా వ్యవహరించింది. వాస్తవ పనులు చేయకుండా దాదాపు 800 కోట్ల రూపాయల అంచనాలు పెంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో లాబీయింగ్ చేసింది. సంబంధిత అధికారులకు లంచాలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి.

4. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ను కాంట్రాక్ట్ డెఫిషియెన్సీ రిపోర్టు (సీడీఆర్) జాబితాలో చేర్చారు. అంతకుముందు లేకపోవడంతో ఇది దొపిడీకే చేశారని అర్థమవుతోంది.

5. తాజా ఐటీ దాడుల్లో సీఎం రమేష్ సంస్థ చాలా నకిలీ సబ్ కాంట్రాక్టర్లను సృష్టించి వారికి కోట్ల రూపాయల ఉప కాంట్రాక్టులను ఇచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈడీసీవొ అనే బోగస్ సంస్థకు రూ.12 కోట్లు చెల్లించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఉనికిలోనే లేదు.

6. తాజాగా రిత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ను ఒడిషా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇనుప ధాతువును సేకరించి ఇనుముగా మార్చే కాంట్రాక్ట్ పొంది పనులు చేయకపోవడంతో ఈ నిషేధం విధించింది.

7. సీఎం రమేష్ నేతృత్వంలోని రిత్విక్ కంపెనీ 2014కు ముందు దాదాపు దివాళా తీసింది. కానీ ఏ టెండర్ లేకుండానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఈ కంపెనీకి రూ.3658 కోట్ల రూపాయల కాంట్రాక్టులను కట్టబెట్టారని సమాచారం. హంద్రీనీవా సుజల స్రవంతి - గాలేరు నగరి - వెలుగొండ సొరంగం - గండికోడ రిజర్వాయిర్ పునరావాస ప్యాకేజీ పనులు ఇలానే ఇచ్చినట్టు సమాచారం.

8. అంతేకాదు.. సీఎం రమేష్ ఆస్తులు - పట్టిన ప్రాజెక్టులకు ఆయన ఎంపీగా పోటీచేసిన సమయంలో దాఖలు చేసిన ఎన్నికల ఆఫిడవిట్లలో భారీగా తేడాలున్నట్లు - సరిపోలేదని అధికారులు గుర్తించారు.

9. గడిచిన మూడు సంవత్సరాల్లో సీఎం రమేష్ ఆదాయం ఘననీయంగా పెరిగింది. అయితే అదే స్థాయిలో ఆదాయపన్ను చెల్లింపులు పెరగలేదని అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీల లెక్కతేల్చే పనిలో అధికారులు పడ్డారు.

10. గడిచిన నాలుగేళ్లలో సీఎం రమేష్ ఆస్తులు - రమేష్ కంపెనీ విలువ వందల కోట్లు పెరిగినట్టు గుర్తించారు. రెండు సంవత్సరాలలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ రిత్విక్ కంపెనీ వ్యాపారం 145శాతం వృద్ధి చెందడంపై ఐటీ అధికారులు విస్తుపోయినట్టు సమాచారం.

11. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీలైన రిత్విక్ ప్రాపర్టీ లిమిటెడ్ - రిత్విక్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిత్విక్ గ్రీన్ పవర్ లిమిటెడ్ - కదిరి గ్రీన్ పవర్ లిమిటెడ్ - గ్లోబల్ ఎర్త్ మినరల్ లిమిటెడ్ - రిత్విక్ అగ్రికల్చరల్ ఫామ్స్ లిమిటెడ్ లలో అవాస్తవ అక్రమ లావాదేవీలు కోట్లాది రూపాయలు దారి మళ్లినట్లు ఐటీ సోదాల్లో బయటపడినట్టు సమాచారం.

ఫైన తెలిపిన అక్రమాల చిట్టాను విజయసాయి బయటపెట్టి సవాల్ విసిరారు. ఇవి నిజాలు కాదని సీఎం రమేష్ నిరూపించాలని.. దమ్ముంటే సిబిఐ లేదా జ్యూడిషియల్ విచారణకు లేఖ రాయాలని సవాల్ విసిరారు. ఒకవేళ నిజంగా సీఎం రమేష్ దోపిడీ దారు అయితే విచారణ కోరకుండా తేలుకుట్టిన దొంగలా ఉంటాడని విజయసాయి ఎద్దేవా చేశారు.