Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి సంచ‌ల‌నం!..క్రిమిన‌ల్స్‌ కు ఏపీ సేఫ్ జోన్‌!

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:05 AM GMT
సాయిరెడ్డి సంచ‌ల‌నం!..క్రిమిన‌ల్స్‌ కు ఏపీ సేఫ్ జోన్‌!
X
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఇంకా పూర్తిగా వీడ‌లేద‌నే చెప్పాలి. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌ లో జ‌య‌రాంను హ‌త్య చేసిన నిందితుడు రాకేశ్ రెడ్డి... ఆయ‌న డెడ్ బాడీని మాత్రం కృష్ణా జిల్లా నందిగామ మండ‌లం ఐత‌వ‌రం స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న ఓ కారులో ప‌డేసి వెళ్లిపోయాడు. అయినా జ‌య‌రాంను తెలంగాణ భూభాగంలోనే హ‌త్య చేసి ఏపీ భూబాగంలో ఆయ‌న మృత‌దేహాన్నిరాకేశ్ రెడ్డి ఎందుకు ప‌డేశాడ‌న్న కోణం గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసులు పెద్ద క‌స‌ర‌త్తే చేశారు. అయితే అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించ‌కుండానే వ‌దిలేశారు. ఇప్పుడు ఆ కార‌ణం ఏమిట‌న్న‌విష‌యాన్ని చెప్పేందుకు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చేశారు.

టీడీపీ స‌ర్కారు - ప్ర‌త్యేకించి ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై నిత్యం త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించ‌డంలో ముందుండే సాయిరెడ్డి... జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఆధారంగానే అదే త‌ర‌హా విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో న‌వ్యాంధ్ర నేర‌స్థుల‌కు సుర‌క్షిత ప్రాంతంగా మారింద‌ని - ఈ విష‌యాన్ని ప‌సిగట్టిన కార‌ణంగానే రాకేశ్ రెడ్డి... జ‌య‌రాం మృత‌దేహాన్ని ఐత‌వ‌రం వ‌ద్ద వ‌దిలేసి నిర్బ‌యంగా వెళ్లిపోయాడ‌ని సాయిరెడ్డి తెలిపారు. ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కారు... రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ప‌ట్టు కోల్పోయింద‌ని - ఈ కార‌ణంగానే క్రిమిన‌ల్స్‌ కు ఏపీ సేఫ్ జోన్‌ గా మారిపోయింద‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాకుండా బాబు జ‌మానాలో ఏపీలో తిమ్మిని బ‌మ్మిని చేయ‌డం సుల‌భ‌మ‌ని, ఈ విష‌యాన్ని కూడా ప‌సిగట్టిన రాకేశ్ రెడ్డి కేసు ద‌ర్యాప్తు ఏపీ ప‌రిధిలోకి వ‌చ్చేలా వ్యూహాత్మ‌కంగా జ‌య‌రాం మృత‌దేహాన్ని ఐత‌వ‌రం వ‌ద్ద వ‌దిలేసి వెళ్లాడ‌ని కూడా పేర్కొన్నారు.

అంతటితో ఆగ‌ని సాయిరెడ్డి... ఈ కేసు ద‌ర్యాప్తును ఏపీ పోలీసుల నుంచి తెలంగాణ పోలీసుల‌కు బ‌దిలీ చేయాలంటూ జ‌య‌రాం స‌తీమ‌ణి ప‌ద్మ‌శ్రీ వినిపించిన వాద‌న‌ను కూడా సాయిరెడ్డి ఇక్క‌డ ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ పోలీసుల ద‌ర్యాప్తుపై తాము మొద‌టి నుంచి అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నామ‌ని చెప్పిన సాయిరెడ్డి... ఇప్పుడు జ‌యరాం స‌తీమ‌ణి కూడా అదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. మొత్తంగా ఏపీ పోలీసుల ద‌ర్యాప్తు ఎలా సాగుతుంద‌న్న విషయం ఇప్ప‌టికైనా జ‌నాల‌కు తెలిసిపోయింద‌న్న వాద‌న‌ను వినిపించేందుకే సాయిరెడ్డి ఇప్పుడు ఈ కేసుపై మాట్లాడార‌న్న వాద‌న వినిపిస్తోంది.