Begin typing your search above and press return to search.

'కరోనా' కన్నా 'నారా వైరస్' యమ డేంజర్

By:  Tupaki Desk   |   5 March 2020 1:13 PM GMT
కరోనా కన్నా నారా వైరస్ యమ డేంజర్
X
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసకుంటోన్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ మహమ్మారి పిశాచికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచంలోని పలు శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన వాక్సిన్‌ కోసం ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయో వివరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్య సభలో ప్రశ్నించారు. అయితే, కరోనా కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని, అంతకంటే ప్రమాదకరమైన `నారా వైరస్` కు ప్రజలు ఎప్పుడో వ్యాక్సిన్ కనిపెట్టేశారని విజయసాయి సెటైర్లు వేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయన తనయుడు లోకేశ్ లపై విజయసాయి సెటైరికల్ ట్వీట్స్ చేశారు. ‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనదని - రాష్ట్ర ప్రజలు నారా వైరస్‌ కు వ్యాక్సిన్ కనిపెట్టేశారని ఎద్దేవా చేశారు. ఆ వ్యాక్సిన్ తోనే 10 నెలల క్రితం `నారా వైరస్‌`ను తరిమికొట్టారని - మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు - కుల మీడియా కిందా మీదా పడుతోందని చురకలంటించారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై విజయసాయి విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు - మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తాము ఎన్నికల్లోనే పోటీ చేయబోమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడని, ఇది చంద్రబాబు చెప్పించిందేనని అన్నారు. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి, ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరంటూ విజయసాయి కితాబిచ్చారు.

రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా, ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదని విజయసాయి మండిపడ్డారు. నాడు నారా వారి ఓటమి భయం ఫలితంగా నేడు ఏపీకి రావాల్సిన రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి బిసీలకు ద్రోహం చేయడమే కాక నిధుల రాకను కూడా అడ్డుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఎవరి ‘బిర్రు’ చూసుకుని రిజర్వేషన్లపై ప్రతాప రెడ్డి కోర్టుకు వెళ్లాడో తమకు తెలుసని విజయసాయి చంద్రబాబుపై మండిపడ్డారు.