Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఓ దొంగ‌: విజ‌యసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   15 May 2018 4:21 PM GMT
చంద్ర‌బాబు ఓ దొంగ‌: విజ‌యసాయిరెడ్డి
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత విజ‌య సాయి రెడ్డి మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప్ర‌జాధనాన్ని అప్ప‌ణంగా కాజేసిన ముఖ్య‌మంత్రి దొంగ‌తో స‌మానమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాలుగేళ్ల పాలనలో చంద్ర‌బాబు మూడు లక్షల కోట్ల రూపాయల‌ అవినీతికి పాల్పడ్డార‌ని మండిప‌డ్డారు. దొంగ ఎక్కడ దాక్కున్నా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి మ‌రీ చట్టప్రకారం శిక్షించాల‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ఖజానా నుంచి దోచుకొని 3ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను విదేశాల‌కు త‌ర‌లించిన చంద్ర‌బాబు దొంగేన‌ని అన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంద‌ని టీడీపీ నేత‌లు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. మ‌హిళ‌ల‌పై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న మండిపడ్డారు. వైసీపీ అధినేత ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా విశాఖ ప‌ట్ట‌ణంలో పాదయాత్ర చేస్తున్న విజయ్ సాయిరెడ్డి అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఎన్నికల హామీలు గుప్పించార‌ని, వాటిలో ఒక్కటీ నెరవేర్చలేద‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు....ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి త‌న స్వార్థం కోసం ప్యాకేజీ తీసుకున్నార‌ని మండిప‌డ్డారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంట‌కాగిన చంద్ర‌బాబు....తాజాగా ఉత్తర కుమారుడిలా బీజేపీతో యుద్ధం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌ర‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. బీజేపీపై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నార‌ని, అందుకే చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకొని హోదా ప‌ల్ల‌వి ఎత్తుకున్నార‌న్నారు. అది క‌ప్పి పుచ్చుకునేందుకు... బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైసీపీతో బీజేపీ పొత్తు ఉండ‌ద‌ని త‌మ అధినేత జ‌గ‌న్ తో పాటు, బీజేపీ రాష్ట్రాధ్య‌క్షుడు క‌న్నా కూడా స్ప‌ష్టం చేశార‌న్నారు. త‌మ‌కు రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, ప్రత్యేక హోదా ఇచ్చేపార్టీతో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు.

మ‌రోవైపు, చంద్ర‌బాబుపై జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సొంత జిల్లా అయిన చిత్తూరు ప్రజలకే న్యాయం చేయని చంద్రబాబు....రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. పేద ప్రజలకు ప్ర‌భుత్వం న్యాయం చేయాల్సింది పోయి....డబ్బున్న వ్యక్తికి న్యాయం చేసేలా ఉంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాల భూమి ఇస్తున్నారని, సొంత జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎందుకు న్యాయం చేయర‌ని ప్రశ్నించారు. చిత్తూరులో రోడ్డు విస్త‌ర‌ణ వ‌ల్ల భ‌వ‌నాలు కోల్పోయిన బాధితుల‌తో ప‌వ‌న్ మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల - విజయనగరం - శ్రీకాళహస్తిలో ఇచ్చిన త‌ర‌హాలోనే చిత్తూరులో నష్ట పరిహారం ఎందుకు ఇవ్వర‌ని ప్ర‌శ్నించారు.