Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ల‌లో ఘాటు మ‌రింత పెరిగింది!

By:  Tupaki Desk   |   30 April 2019 9:07 AM GMT
విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ల‌లో ఘాటు మ‌రింత పెరిగింది!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ట్వీట్ల‌తో విరుచుకుప‌డే జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో ఆ పార్టీ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి ముందుంటారు. బాబుపై విమ‌ర్శ చేసే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌రు. అంతేనా.. ఎలాంటి మొహ‌మాటం లేకుండా నిర్ద‌య‌గా బాబును క‌డిగిపారేసే విజ‌య‌సాయిరెడ్డి .. తాజాగా బాబు నీతుల‌కు కౌంట‌ర్ ఇచ్చేశారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది త‌న‌కు ట‌చ్ లో ఉన్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్య‌పై బాబు ఆగ‌మాగం అవుతూ పెట్టిన ట్వీట్ల‌పై విజ‌య‌సాయిరెడ్డి చెల‌రేగిపోయారు. త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు ఈ సుమ‌తీ శ‌త‌కాలు ఏమ‌య్యాయి బాబు? అంటూ ఫైర్ అయిన విజ‌య‌సాయిరెడ్డి .. అక్క‌డెక్క‌డో బెంగాల్ లో ప్ర‌ధాని మోడీ మాట‌కు.. అమ‌రావ‌తిలో బాబు ప‌ళ్లు కొరుక్కుంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమ్మెత్తి పోశారు.

మండే ఎండ‌ల్లో మ‌రింత మంట పుట్టేలా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ల‌ను య‌థాత‌ధంగా చూస్తే.. బాబు చేసిన త‌ప్పులు సినిమా స్కోప్ లో క‌నిపిస్తాయి. ప్ర‌ధాని మోడీ మాట‌లకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా అనిపించినా.. అందులో బాబు యాంగిల్ మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

ఇంత‌కీ.. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఘాటు ట్వీట్లు చూస్తే..

+ మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?

+ చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి.

+ దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్ ను - డ్వాక్రా ఉత్పత్తులు మార్కెటింగుకు వాల్ వార్ట్ ను ఒప్పించానని - కొబ్బరి నీళ్లను పెప్సీ అమ్ముతుందని కోశాడు. విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా?

+ టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక - మట్టి తరలి స్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. సిఎస్ తక్షణం కొరడా ఝ‌ళిపించాలి.