Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి!

By:  Tupaki Desk   |   25 Jun 2022 9:30 AM GMT
పిక్ టాక్: ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి!
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన ద్రౌప‌ది ముర్ముకేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఒక గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌పార‌ని.. అందువ‌ల్ల త‌మ మ‌ద్ద‌తు ఆమెకే ప్ర‌క‌టిస్తున్నామ‌ని ఆ పార్టీ వివ‌రించింది. దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక‌ పార్టీ త‌మ‌దేన‌ని తెలిపింది. మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో సామాజిక న్యాయాన్ని చూపుతున్న త‌మ పార్టీ గిరిజ‌న మ‌హిళ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నందువ‌ల్ల ఆమెకే త‌మ మ‌ద్ద‌తు అని వివ‌రించింది.

ఈ నేప‌థ్యంలో జూన్ 24న ద్రౌప‌ది ముర్ము ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు శివ‌రాజ్ సింగ్ చౌహాన్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్), కర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై, ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్, అప్నాద‌ళ్ పార్టీ అధినేత అనుప్రియా ప‌టేల్, అన్నాడీఎంకే క‌న్వీన‌ర్ ప‌న్నీర్ సెల్వం త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ స‌మ‌ర్పిస్తున్న‌ప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల వెన‌కే విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారు. విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌లే రెండోసారి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని.. త‌మ‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచార‌ణ‌ను జాప్యం చేయ‌డమే ల‌క్ష్యంగా విజ‌య‌సాయిరెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపార‌ని గ‌తంలోనే వార్త‌లు, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇందుకు త‌గ్గ‌ట్టే విజ‌యసాయిరెడ్డి గ‌తంలో అంటే ఆరేళ్ల క్రితం మొద‌టిసారి రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన‌ప్పుడే బీజేపీ పెద్ద‌ల‌తో రాసుకుపూసుకు తిరిగార‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌ప్పుడు, వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోపాటు, బీజేపీ ముఖ్య నేత‌లతో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ఇటీవ‌ల రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో రెండోసారి విజ‌యసాయిరెడ్డిని తిరిగి రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌డం లేద‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చాయ‌ని గుర్తు చేస్తున్నారు. అయితే త‌మ‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల భ‌యంతోనే వైఎస్ జ‌గ‌న్.. విజ‌య‌సాయిరెడ్డిని రెండోసారి రాజ్య‌స‌భ‌కు పంపార‌ని చెబుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టే విజ‌య‌సాయిరెడ్డి కూడా త‌న బాస్ అప్ప‌గించిన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తున్నార‌ని అంటున్నారు.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ముందు ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ ఉకై పేరు వినిపించింది. దీంతో విజ‌య‌సాయిరెడ్డి హుటాహుటిన ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ‌పూర్ లో వాలార‌ని గుర్తు చేస్తున్నారు. రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి అన‌సూయ ఉకైకి అభినంద‌న‌లు తెలిపి.. ఆమెకు స‌న్మానం చేసి వ‌చ్చారు. ఇవ‌న్నీ ముందు జాగ్ర‌త్త‌గా భ‌విష్య‌త్తు ప‌రిణామాల నేప‌థ్యంలో చేసింద‌నే చెబుతున్నారు. గ‌తంలోనూ రామ్ నాథ్ కోవింద్ పేరు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి వినిపించ‌గానే విజ‌య‌సాయిరెడ్డి బిహార్ రాజ‌ధాని పాట్నా వెళ్లి రామ్ నాథ్ కు శాలువా క‌ప్పి వ‌చ్చార‌ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు కూడా ఈ కేసుల భ‌యంతోనే బీజేపీ అభ్య‌ర్థికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి చురుకుగా పాలుపంచుకున్నార‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు.