Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి రూటే వేరు

By:  Tupaki Desk   |   8 Feb 2018 5:22 PM GMT
విజయసాయిరెడ్డి రూటే వేరు
X
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దిల్లీలో చేస్తున్న రాజకీయాలు పాలక టీడీపీలో చంద్రబాబు నుంచి చిన్నస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ప్రత్యక్ష రాజకీయాల అనుభవం ఆయనకు చాలా తక్కువే అయినా, ప్రత్యక్ష రాజకీయాల్లో తలలు పండిపోయినవారికి కూడా సాధ్యం కాని రీతిలో ఆయన పార్లమెంటులో పార్టీ స్వరం వినిపించడం ఒక్కటే కాకుండా దిల్లీలో చాలా యాక్టివ్ గా ఉంటూ అగ్రనేతలను కలుస్తూ ఏపీలో పరిణామాలను నిత్యం వారికి వివరిస్తున్నారు. అంతెందుకు మోదీ అపాయింటుమెంటు చంద్రబాబుకు కూడా దొరకడం కష్టమవుతుంటే సాయిరెడ్డి సింపుల్ గా వెళ్లి కలిసొచ్చేశారు. ఇప్పుడు రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆయన కలవడం కూడా అంతే. రాజ్యసభలో చైర్మన్ హోదాలో ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు సభలో సాయిరెడ్డిపై ఆగ్రహించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్ది వ్యవధిలోనే సాయిరెడ్డి ఏకంగా రాష్ర్టపతి అపాయింట్‌ మెంట్ తీసుకుని కలిసి వచ్చారు. దీంతో వెంకయ్యనాయుడిపై ఆయన రాష్ర్టపతికి ఫిర్యాదు చేసి ఉండొచ్చన్న ప్రచారం ఒకటి దిల్లీలో జరుగుతోంది.

అయితే... సాయిరెడ్డి మాత్రం తాను ఏపీలో పిరాయింపుల వ్యవహారాలపై రాష్ర్టపతికి చెప్పానని అంటున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాగోగులు - ఆయన చేపడుతున్న పాదయాత్ర గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 - 75ను వారు అతిక్రమిస్తున్నారని కోవింద్‌కు వివరించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఏపీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు సాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది... టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ బేరసారాలు చేస్తున్నారని, రూ. 25 కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో భాగంగా టీజీ వెంకటేశ్‌ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశారని, త్వరలోనే టీజీ వెంకటేశ్‌ బాగోతాన్ని బయటపెడతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. విభజన చట్టంలో అమలుకాని అంశాలను రాష్ట్రపతికి వివరించామని ఆయన తెలిపారు. ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగా అందరినీ కలుస్తున్నామని, సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసీని కూడా కలుస్తామని తెలిపారు.

కాగా దిల్లీ రాజకీయాల్లో ఎవరినైనా సులభంగా కలిసే నేతలుగా గతంలో కొద్దిమందికే పేరుండేది. మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, జైపాల్‌రెడ్డి వంటి అతికొద్ది మందికి మాత్రమే దిల్లీలో కూడా చురుగ్గా రాజకీయాలు చేసిన అనుభవం.. ప్రధానులు - రాష్ర్టపతులను - ప్రతిపక్ష పార్టీల అధినేతలను సులభంగా కలిసేంత పలుకుబడి ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా వారిలానే పార్టీ కోసం దిల్లీలో కీలకంగా మారారని అంటున్నారు.