Begin typing your search above and press return to search.

జిల్లాల ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి

By:  Tupaki Desk   |   13 Jun 2019 2:01 PM GMT
జిల్లాల ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి
X
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి కావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ స్థానాల సరిహద్దులు.. వాటి మార్పునకు సాధ్యాసాధ్యాలను చూస్తున్నారు.

తాజాగా దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం వైసీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి ‘‘పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు - ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. వాటిని నేరవేర్చేందుకు చాలా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయి. కొత్త వాటితో కలిపి 25 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ కార్యాలయాన్ని కూడా తరలిస్తాం’’ అని ఆయన చెప్పారు.

ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం రెవెన్యూ శాఖ మంత్రిగా నియమితులైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కూడా చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో త్వరలోనే కొత్త జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామన్నారు. నూతన భవనాలు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణకు మార్కెట్‌ రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే రాష్ట్రంలో భూముల రీసర్వే చేపడతామని వెల్లడించారు. ఇప్పుడు విజయసాయి కూడా జిల్లాల ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశం అవుతోంది.

వాస్తవానికి వైసీపీ నాయకత్వం కోరిక మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా రెవెన్యూ శాఖ వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా జిల్లా - రెవెన్యూ మండలాల వారీగా ఉన్న జనాభా - ఇతర సమాచారాన్ని వెంటనే పంపాలని కలెక్టర్లను కోరినట్టు రెవెన్యూ శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నవాటి స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటికి సంబంధించిన రికార్డుల పరిశీలన నిరంతరంగా కొనసాగుతుందని తెలిసింది.