Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆదేశం మేరకే జగన్ తో చర్చలు

By:  Tupaki Desk   |   16 Jan 2019 6:00 AM GMT
కేసీఆర్ ఆదేశం మేరకే జగన్ తో చర్చలు
X
జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చెరగని ముద్ర వేయాలని కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ముందడుగు వేశారు. ఇటీవలే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన కేసీఆర్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే..ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో ఎంపీ వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి - శ్రావణ్ కుమార్ రెడ్డిల బృందం ఈరోజు వైఎస్ జగన్ ను ఆయన హైదరాబాద్ లోని నివాసంలో మధ్యాహ్నం 12.30కు కలువబోతున్నారు.

అయితే తాజాగా కేటీఆర్ - వైఎస్ జగన్ ల భేటిపై వైఎస్సార్ సీపీ నేత - రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వైఎస్సార్ సీపీతో చర్చించేందుకు కేటీఆర్ వస్తున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కేటీఆర్ కూడా తాజాగా ట్విట్టర్ ద్వారా దీన్నే ధృవీకరించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తమ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్ తో ఈ మధ్యాహ్నం భేటి అవుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీజేపీ - కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అవ్వాలని జగన్ ను కోరనున్నట్టు వివరించారు.