Begin typing your search above and press return to search.

మండలి పరిణామాలపై విజయసాయిరెడ్డి సెటైర్లు విన్నారా?

By:  Tupaki Desk   |   24 Jan 2020 11:19 AM GMT
మండలి పరిణామాలపై విజయసాయిరెడ్డి సెటైర్లు విన్నారా?
X
వైసీపీ ప్రధాన కార్యదర్శి - పార్లమెంటులో ఆ పార్టీ పక్ష నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై ఏ రీతిన విరుచుకుపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రత్యేకించి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ లపై విజయసాయిరెడ్డి సంధించే విమర్శలు ఓ రేంజిలో పేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో వికేంద్రీకరణ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ బుధవారం నాటి శాసనమండలి పరిణామాలపై తాజాగా విజయసాయిరెడ్డి సంధించిన ట్వీట్లు మరోమారు పేలిపోయాయనే చెప్పాలి.

అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకునేందుకు టీడీపీ... తనకు బలమున్న శాసనమండలిని వినియోగించుకుందని సాయిరెడ్డి సదరు ట్వీట్ లో నిప్పులు చెరిగారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని సాయి రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సభలో యనుమల రామకృష్ణుడు అవలంభించిన తీరుపై సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. 'ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబు స్పీకర్‌ గా తెరపైకి తీసుకొచ్చాడని - అదే విధంగా యనమల కూడా తన బాస్ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన 'చరిత్రలో నిల్చేంత' సేవ చేశారని విమర్శించారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్ఠను కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంటగలిపారని' విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

ఈ ట్వీట్ కు జతగా సంధించిన మరో ట్వీట్‌లో సాయిరెడ్డి చంద్రబాబు వేస్తున్న తప్పటడుగులను ప్రస్తావించడంతో పాటుగా మండలిలో సభ్యులుగా ఉన్న లోకేశ్ - యనమల రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోందన్న విషయాన్ని కూడా తనదైన శైలిలో వివరించారు. 'అహంకారం - దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుందంటూ' విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నిజంగానే వైరల్ గా మారిపోయిందనే చెప్పాలి.