Begin typing your search above and press return to search.

తెదేపా ‘ట్రేడింగ్ ఎంపీ’కి త్వరలోనే ముహూర్తం!

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:43 PM GMT
తెదేపా ‘ట్రేడింగ్ ఎంపీ’కి త్వరలోనే ముహూర్తం!
X
భాజపా నాయకుడు సోము వీర్రాజు ఇటీవల కర్నూలులో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో రూలింగ్ లేదని ట్రేడింగ్ ఉందని చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తే. ఆ సందర్భంగా ఓ ఎంపీ ట్రేడింగ్ తోనే రాజ్యసభ ఎంపీ కాగలిగాడని కూడా సోము వీర్రాజు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంతకూ సదరు ట్రేడింగ్ ఎంపీ ఎవరా అని రకరకాల కాంబినేషన్లు వస్తున్నప్పటికీ.. కర్నూలు వేదికగా సోము విమర్శలు గుప్పించారు గనుక.. ఇదంతా అదే జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్ గురించే కావచ్చునని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు సదరు ‘ట్రేడింగ్ ఎంపీ’గా ముద్ర పడిన టీజీ వెంకటేష్ బండారం బట్టబయలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రాబోయే రాజ్యసభ ఎన్నికల వేళకు 25 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేయడానికి టీజీ వెంకటేష్ మంతనాలు సాగిస్తున్నారని - తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఉత్తుత్తి ఆరోపణలు మాత్రమే కాదు.. ఆయన ఏకంగా రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి... రాజ్యసభలో మంత్రి సుజనాచౌదరి రాజ్యాంగ వ్యతిరేకంగా - నిబంధనల్ని తుంగలో తొక్కుతూ చేసిన ప్రసంగం గురించి కూడా ఫిర్యాదు చేశారు. సుజనా చౌదరి వైఖరిని అడ్డుకుంటూ తాను పాయింటాఫ్ ఆర్డర్ లేవనెత్తితే తోసిపుచ్చిన సభాపతి వెంకయ్యనాయుడు వైఖరిపై కూడా ఫిర్యాదుచేశారు.

ఈ సందర్భంగానే రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో పెద్దయెత్తున అక్రమాలకు తెలుగుదేశం ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు విజయసాయి ఫిర్యాదు చేయడం విశేషం. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఓట్లను కూడా పొందడానికి టీజీ వెంకటేష్ బేరసారాలు సాగిస్తున్నట్లుగా ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెల్లడించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి చేసిన ప్రయత్నాల గురించి తమవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని త్వరలోనే వాటితో సహా.. టీజీ బండారం బయటపెడతాం అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తమ పార్టీనుంచి తెలుగుదేశం లోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి టీజీ డబ్బు ఆఫర్ చేశారని, అసలు చంద్రబాబు పాల్పడుతున్న ఈ ఫిరాయింపుల గురించి రాష్ట్రపతికి నివేదించడంతో పాటు, ఈసీని కూడా కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు.