Begin typing your search above and press return to search.
సాయిరెడ్డి సంచలనం!...వెంకయ్యకు చుక్కలేనా?
By: Tupaki Desk | 8 Feb 2018 12:18 PM GMTకేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన తీరు... కొందరు నేతలను హీరోలను చేస్తుంటే - మరికొందరు నేతల ప్రతిష్ఠను దిగజారుస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై ఆది నుంచి నిరసనలు కొనసాగిస్తున్న వైసీపీ... పార్లమెంటు సాక్షిగానే తనదైన శైలిలో పోరు సాగిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువ భేరీల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే,... ఆ పార్టీ ఎంపీలుగా ఉన్న నేతలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై పోరు సాగిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు ఎంపీగా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టగా.. ఇప్పుడు రాజ్యసభలో ఆ పార్టీ ఏకైక ఎంపీగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి... తనవంతు పోరాటానికి శ్రీకారం చుట్టారు. రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ప్రతిపాదించిన సాయిరెడ్డి... రాజ్యసభలో సింగిల్ ఉన్నా... సింహంలానే గర్జిస్తున్నారనే చెప్పాలి.
ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు... సాయిరెడ్డిని నిలువరించే క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సాయిరెడ్డి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ పైనా వెంకయ్య తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఆగ్రహోదగ్రుడైన సాయిరెడ్డి.. వెంకయ్యపై ఏకంగా ప్రత్యక్ష పోరుకే శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న వెంకయ్య తనపై వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్లు చేసిన సాయిరెడ్డి... ఈ విషయంలో వెంకయ్యపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. వెంకయ్యపై నేరుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసేందుకు సాయిరెడ్ది నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ను సాధించిన సాయిరెడ్డి... నేటి సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరనున్నారు.
ఇప్పటికే ఈ విషయంపై కుండబద్దలు కొట్టిన సాయిరెడ్డి... వెంకయ్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజ్యసభలో తాను లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన చైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మొత్తంగా క్రియాశీల రాజకీయాల్లో ఉండగా.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పలుమార్లు అందుకున్న వెంకయ్య... రాజ్యసభ చైర్మన్ స్థానంలో మాత్రం అంతగా రాణించలేకపోతున్నారని ఈ విషయంతో తేలిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతుల మీద రాష్ట్రపతికి ఇప్పటిదాకా ఫిర్యాదే వెళ్లలేదన్న వాదన కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో వెంకయ్యపై వెళ్లే ఫిర్యాదే... ఉపరాష్ట్రపతిపై రాష్ట్రపతికి వెళ్లనున్న తొలి ఫిర్యాదుగానూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి రాజ్యసభలో సత్తా కలిగిన నేతగా సాయిరెడ్డి చక్రం తిప్పుతూనే... తనదైన శైలిలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న వెంకయ్యకు కూడా చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధం చేశారన్న మాట. చూద్దాం... ఏం జరుగుతుందో?