Begin typing your search above and press return to search.

రోజా తీసుకోవాల్సింది.. రాములమ్మ ఆవేదన

By:  Tupaki Desk   |   11 Jun 2019 7:57 AM GMT
రోజా తీసుకోవాల్సింది.. రాములమ్మ ఆవేదన
X
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ - ప్రముఖ నటి విజయ శాంతి ఏపీ కేబినెట్ విస్తరణపై తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పుపై సంచలన కామెంట్స్ చేశారు. ఓవైపు పొగుడుతూనే లోపాలను ఎత్తి చూపారు. అయితే సినీ నటి రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంపై మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ వైఖరిని సైతం తప్పుపట్టడం విశేషం.

*రోజాకు మంత్రి పదవి ఇవ్వాల్సింది..

తెలుగు ప్రజలే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురుచూసిన మంత్రివర్గంలో రోజాకు చోటు లేకపోవడంపై విజయశాంతి కూడా స్పందించారు. రోజాను కూడా తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సినీ రంగానికి ప్రాతినిధ్యం కల్పించి జగన్ రోజాకు పదవి ఇస్తే బాగుండేదని.. సినీ రంగం నుంచి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలను వినియోగించాలని జగన్ కు విజయశాంతి సూచించారు. ఇప్పటికైనా రోజా విషయంలో జగన్ పునరాలోచించాలని.. ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బావుంటుందని జగన్ కు స్పష్టం చేశారు.

*జగన్ ను చూపించి కేసీఆర్ కు వాతలు..

జగన్ మంత్రి వర్గాన్ని చూపించి తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజయశాంతి వాతలు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలకు మంత్రి పదవులే ఇవ్వడం లేదని విజయశాంతి మండిపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ మాత్రం ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని కొనియాడారు. జగన్ తన కేబినెట్ లో మహిళకు హోంమంత్రి పదవితోపాటు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారని.. కనీసం జగన్ ను చూసైనా కేసీఆర్ మారాలని హితవు పలికారు.

*సినీ రంగాన్ని మరవద్దంటున్న రాములమ్మ..

విజయశాంతి తాజా ట్వీట్ తో వైసీపీకి చురకలతోపాటు కేసీఆర్ టార్గెట్ గా స్పందించారు. మొన్నటి ఎన్నికల వేళ వైసీపీ గెలుపు కోసం చాలా మంది సినీ సెలబ్రెటీలు పనిచేశారు. కమెడియన్లు ఫృథ్వీ - అలీ - సినీ ప్రముఖులు జీవితా - రాజశేఖర్ సహా చాలా మంది టాలీవుడ్ నటులు వైసీపీ కోసం ప్రచారం చేసి ఆ పార్టీని గెలిపించారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇస్తే బాగుండేదని విజయశాంతి డిమాండ్ చేయడం గమనార్హం. స్వతహాగా సినీ రంగం నుంచి వచ్చిన విజయశాంతి రోజాకు మద్దతు తెలుపడం చర్చనీయాంశంగా మారింది.