Begin typing your search above and press return to search.

రూ.1300 కోట్లు...ఎస్ బ్యాంకుతో బాబు కుమ్మక్కు

By:  Tupaki Desk   |   7 March 2020 9:00 AM GMT
రూ.1300 కోట్లు...ఎస్ బ్యాంకుతో బాబు కుమ్మక్కు
X
బీసీలపై మాజీ సీఎం చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటుబ్యాంకుగానే చూసిన బాబు....అసెంబ్లీ టికెట్లు మొదలుకొని నామినేటెడ్ పోస్టుల వరకు తన సామాజిక వర్గానికే....పే...ద్ద పీట వేశారు. చంద్రబాబు కు పూర్తి భిన్నంగా సీఎం జగన్ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తూ మాట నిలబెట్టుకున్నారు. దీంతో, గోతికాడనక్కలా ఉన్న చంద్రబాబు....బీసీల రిజర్వేషన్ల అంశంపై జగన్ కు క్రెడిట్ దక్కడాన్ని జీర్ణించుకో లేక తన అనుచరులతో కోర్టులో పిటిషన్ వేయించారు. 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదంటూ కోర్టు చెప్పడంతో...ఇపుడు యూటర్న్ తీసుకొని...బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై ప్రతాప రెడ్డితో బాబు కేసు వేయించి కొట్టేయించారని, అంతేకాకుండా , బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెట్టారని విజయసాయి ట్వీట్ చేశారు. ఎన్నికలు జరగకూడదనేదే బాబు అసలు ఉద్దేశం అని, సిగ్గు,శరం లేని మనిషి అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. మరో వైపు, ఎస్‌ బ్యాంకు పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన వ్యవహారం పై కూడా విజయసాయి స్పందించారు. ఎస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశాడని,1,300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి గారు సకాలం లో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడం తో ప్రమాదం తప్పిందని అన్నారు. ఎస్‌ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడని, ఇలాంటి దోపిడీలు ఇంకెన్ని ఉన్నాయోనని విజయసాయి అన్నారు. తన ఆరోపణలకు ఆధారంగా ఎస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను విజయసాయి పోస్ట్ చేశారు.