Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త ఫోబియా పేరు చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి!

By:  Tupaki Desk   |   29 Feb 2020 4:30 PM GMT
ఏపీలో కొత్త ఫోబియా పేరు చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి!
X
ఫోబియా...లేనిది ఉన్న‌ట్లు ఊహించుకుంటూ ఓ ర‌క‌మైన భ‌యం, భ్రాంతిలో బ్ర‌తికేయ‌డ‌మే ఫోబియా ప్ర‌ధాన ల‌క్షణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు . ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు కొంత‌కాలంగా ఓ ఫోబియాతో ఇబ్బందిప‌డుతున్నారంటూ వైసీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ తానే ముఖ్య‌మంత్రిన‌నే ఫోబియా లో బాబు కొట్టుమిట్టాడుతున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించేవారు. ఆ ఫోబియాకు మందే లేద‌ని....భ‌విష్య‌త్తులో బాబు సీఎం అయ్యే చాన్సే లేద‌ని వైసీపీ నేత‌లు సెటైర్లు వేసేవారు. ఇక‌, తాజాగా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌కు ఓ స‌రి కొత్త ఫోబియా ప‌ట్టుకుంట‌ద‌ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప‌రోక్షంగా ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన తండ్రీ కొడుకుల‌ను ప‌ట్టి పీడిస్తోన్న `పులివెందుల ఫోబియా`ను నోటిఫై చేయాల‌ని విజ‌య‌సాయి విజ్ఞ‌ప్తి కూడా చేస్తూ చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది.

మాజీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. తండ్రీ కొడుకులిద్ద‌రూ పులివెందుల ఫోబియా లో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని సెటైర్లు వేశారు. వైద్య శాస్త్రంలో ఎక్కడా కనిపించని ఓ రోగం, రాష్ట్రంలోని తండ్రీ కొడుకులను పట్టుకుందని, దాని పేరు 'పులివెందుల ఫోబియా' అని విజ‌య‌సాయి ట్వీట్ చేశారు. "వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు" అని విజయసాయి చేసిన‌ ట్వీట్ వైర‌ల్ అయింది.

ఈ మ‌ధ్య కాలంలో ఏపీలో చీమ చిటుక్కుమ‌న్నా స‌రే దానికి పులివెందుల వారే కార‌ణ‌మంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా విశాఖలో చంద్ర‌బాబు అడ్డ‌గింత నేప‌థ్యంలో జ‌గ‌న్ పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్‌కు టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పర్యటనకు అన్ని అనుమతులు ఉన్నాయని, అయినా రాజకీయ కక్షతో అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు,లోకేశ్ ల‌పై ప‌రోక్షంగా విజ‌య‌సాయి ట్వీట్ చేశారు.