Begin typing your search above and press return to search.

విజ‌యసాయిరెడ్డితో మోడీ 15 నిమిషాలు ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   12 April 2017 5:50 PM GMT
విజ‌యసాయిరెడ్డితో మోడీ 15 నిమిషాలు ఏం మాట్లాడారు?
X
వైఎస్సార్‌సీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆప్తుల్లో ఒక‌రైన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డి అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో విజ‌య‌సాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏకంగా ఐదు ప‌ది నిమిషాలు కాకుండా పావుగంట‌కు పైగా వీరి స‌మావేశం కొన‌సాగింది. మంగళవారం ఉదయం 11.45 గం.లకు ఈ భేటీ జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడితో ప్ర‌ధాని మోడీ ఇంత‌సేపు ఏకాంతంగా ముచ్చ‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం సంద‌ర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రజా సమస్యలపై విజయసాయిరెడ్డి దాదాపు 15 నిమిషాలసేపు చర్చించారుని తెలుస్తోంది. విజ‌యసాయిరెడ్డి చెప్పిన అన్ని అంశాలపైనా ప్రధాని సానుకూలంగా స్పందించారని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ఫిరాయింపుల ప‌ర్వం కూడా ప్ర‌ధానికి విజ‌య‌సాయిరెడ్డి తెలియ‌జేశారు. ఏపీలో ప్ర‌తిప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేల‌ను ముఖ్య‌మంత్రి,టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఫిరాయింప చేయ‌డ‌మే కాకుండా వారికి కేబినెట్‌లోకి తీసుకున్న తీరును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి వైఎస్ జ‌గ‌న్ స‌న్నిహితుడైన విజ‌యసాయిరెడ్డి తీసుకువెళ్లార‌ని స‌మాచారం. జంప్ జిలానీల‌పై చ‌ర్య‌లు కోరుతూ ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఇంకా పెండింగ్‌లో ఉంచ‌డం ప్ర‌స్తావ‌న‌కు వచ్చిన‌ట్లు తెలుస్తోంది.