Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై శివాలెత్తిన రాములమ్మ.. ఏమందంటే?

By:  Tupaki Desk   |   7 July 2020 5:38 PM GMT
కేసీఆర్ పై శివాలెత్తిన రాములమ్మ.. ఏమందంటే?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ను శిశుపాలుడితో పోల్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేసీఆర్ తప్పులు తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన కేసీఆర్... త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తాజా పరిణామాలను చూస్తుంటే అర్థం అవుతోందని విజయశాంతి నిప్పులు చెరిగారు.

ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కెసిఆర్ కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌ గా మారిందని విజయశాంతి ఆరోపించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దాన్ని అవహేళన చేశారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కెసిఆర్ గారు శాపనార్థాలు పెట్టారని.. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే... దానిని కూడా సీఎం కేసీఆర్ అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అని విజయశాంతి విమర్శించారు.

ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారని ఆమె అన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ గారు ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని విజయశాంతి నిప్పులు చెరిగారు.