Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు వీసా ఎలా ఇస్తారు కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   23 Jan 2018 11:38 AM GMT
ప‌వ‌న్‌ కు వీసా ఎలా ఇస్తారు కేసీఆర్‌?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ ఎస్ ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. టీఆర్ ఎస్ తీరు ఇలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌.. బీజేపీలు మాత్రం ఆగ‌మాగ‌మైపోతున్న ప‌రిస్థితి. ప‌వ‌న్ నోటి వెంట కేసీఆర్ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు రాక‌పోక‌వ‌టంపై వారు తీవ్ర ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీలో మాదిరి తెలంగాణ‌లోనూ అధికార‌ప‌క్షానికి ద‌న్నుగా ప‌వ‌న్ ఉంటే.. త‌మ విజ‌య‌వ‌కాశాల్ని ప‌వ‌న్ దెబ్బేసే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ కార‌ణంతోనే ఎప్పుడూ లేని రీతిలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ప‌వ‌న్ టూర్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించిన నేత‌ల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావ‌టం చూస్తేనే.. ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ప‌వ‌న్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పు ప‌ట్టే రీతిలో కాంగ్రెస్ నేత‌లు ఉన్నారు. వారికి తోడుగా బీజేపీ నేత‌లు అక్క‌డ‌క్క‌డా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ పార్టీల‌కు భిన్నంగా టీఆర్ ఎస్ మాత్రం మౌనంగా ఉంది. మాట్లాడిన ఒక‌రిద్ద‌రు చిన్న చిన్న చుర‌క‌లేసినా.. ప‌వ‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లైతే చేయ‌లేద‌ని చెప్ప త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. తోటి కాంగ్రెస్ నేత‌ల‌కు తోడుగా ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి నోరు విప్పారు. ప‌వ‌న్ యాత్ర‌పై ప్ర‌శ్న‌లు సంధించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మె జ‌రిగిన స‌మ‌యంలో ప‌వ‌న్ ను టూరిస్ట్ గా కామెంట్ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో ప‌ర్య‌టించేందుకు వీసా ఎలా జారీ చేశార‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ లాంటి టూరిస్ట్ నేత‌కు స్వేచ్ఛ క‌ల్పించిన ప్ర‌భుత్వం ఉద్య‌మ నేత‌ల‌కు మాత్రం ఆ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌టం శోచ‌నీయ‌మ‌న్నారు.

తెలంగాణ కోసం పోరాడిన జేఏసీ నేత‌ల‌కు కూడా ప‌వ‌న్ మాదిరి వీసాలిస్తే.. వారికి క‌నీసం తెలంగాణ‌లో తాము ఉన్నామ‌న్న భావ‌న క‌లుగుతుంద‌న్నారు. జేఏసీ నేత‌ల్ని నిర్బంధిస్తున్న తీరును చూస్తుంటే తెలంగాణ బిడ్డ‌ల ప‌రిస్థితి ఎంత దారుణంగా మారితో తెలుస్తుంద‌ని విజ‌య‌శాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టివ‌రకూ కాంగ్రెస్ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా విజ‌య‌శాంతి వ్యాఖ్య‌లు భిన్నంగా ఉండ‌టంతో పాటు.. తెలంగాణ‌లో ఇంత దారుణ ప‌రిస్థితి ఉందా? అన్న భావ‌న క‌లిగేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. సీఎం కేసీఆర్ పై ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడుతున్న ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ నేత‌ల్లో పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క‌వ్యాఖ్య చేశారు. ప‌వ‌న్ యాత్ర‌ను అడ్డుకుంటామ‌న్నారు.