Begin typing your search above and press return to search.

ఈ వికృత చేష్టలకు ఏ శిక్ష వేయాలి : విజయశాంతి

By:  Tupaki Desk   |   4 Jun 2020 6:50 AM GMT
ఈ వికృత చేష్టలకు ఏ శిక్ష వేయాలి :  విజయశాంతి
X
ఓవైపు ప్రపంచాన్ని ఓ మహమ్మారి వణికిస్తున్న కొందరికి బుద్ధి రావడం లేదు. మూగ జీవాలు, జంతువులను ఆదుకోవాల్సింది పోయి వాటి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకోవాలని సినీతారలు సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేశారు.

ఈ ఘటన పై , సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల విషయంలో కొందరు మనషులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న తీరుపై ఫేస్ ‌బుక్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ సృష్టిలో ఎంతో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతి పై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు.... మిగిలిన జీవాల మనుగడ ఈ మనుషుల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు... కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూరిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృత చేష్టలకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? ఈ సంఘటనకు ముందు టిక్‌టాక్ వీడియో కోసం ఒక కుక్కపిల్ల కాళ్ళూ చేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరేసి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం. అంతకు ముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు.

మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు... అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు... దిగజారిన పరిస్థితులు... చూస్తుంటే మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు’’ అంటూ విజయశాంతి తెలిపింది.