Begin typing your search above and press return to search.

ఈటెల భూకబ్జా ఆరోపణలపై రాములమ్మ రియాక్టు అయ్యారుగా?

By:  Tupaki Desk   |   1 May 2021 3:15 AM GMT
ఈటెల భూకబ్జా ఆరోపణలపై రాములమ్మ రియాక్టు అయ్యారుగా?
X
కరోనా.. కరోనా.. తప్పించి మరింకే కనిపించని వేళ.. ప్రజలంతా ఒకలాంటి ట్రాన్స్ లో ఉండిపోయిన వేళ.. తమకు ఎదురవుతున్న కష్టాల్ని.. ఇబ్బందుల్ని కాసేపు మర్చిపోయే రాజకీయ అలజడి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనాను కాసేపు పక్కన పెట్టేసి.. ఏందిలా జరిగింది? అసలేం జరగనుంది? ఎక్కడేం తేడా వచ్చిందని.. ఇప్పుడీ విపత్తు వేళలో ఈటెలను సారు టార్గెట్ ఎందుకు చేశారు? లాంటి ప్రశ్నలెన్నో వినిపిస్తున్నాయి.

ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాకు పాల్పడినట్లుగా కేసీఆర్ కుటుంబానికి చెందిన టీ న్యూస్ చానల్ లో ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేయటం పెను దుమారంగా మారింది. ఇటీవల కాలంలో కేసీఆర్ సర్కారుపైన అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు సంధించే మంత్రి ఈటెల మీద.. ఆయన ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేలా భూకబ్జా ఆరోపణలు చేయటం.. అది కూడా అధికారపక్షానికి చెందిన టీవీ చానల్ లో రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

తనపై ప్రసారమైన కథనంపై మంత్రి ఈటెల రాజేందర్ రియాక్టు అయ్యారు. తొందరపడి సీఎం కేసీఆర్ మీద ఎలాంటి విమర్శ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో.. పరోక్షంగా తెలంగాణ అధికారపక్షంలో ఎందరో నేతలు భూకబ్జాలకు పాల్పడినా పట్టించుకోని సీఎం.. తనను టార్గెట్ చేశారన్న భావన కలిగేలా ఈటెల మాటలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మీద ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని వేళ.. తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో రియాక్టు అయ్యారు.

‘‘లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటెల రాజేందర్ గారిది మరో దుర్మార్గం. తెలంగాణ ప్రజలకు ఈ దొర అహంకారపు ధోరణుల నుండి త్వరలో విముక్తి తప్పక లభించి తీరుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ ను దొరగా అభివర్ణించిన రాములమ్మ.. ఈటెలను బడుగు బలహీన వర్గాల నేతగా అభివర్ణించారు. తమ్ముడు ఈటెలను సారు టార్గెట్ చేసిన తీరుపై మండిపడిన తీరు చూస్తే.. రానున్న రోజుల్లో రాములమ్మ మరిన్ని పంచ్ లు వేయటం ఖాయమని చెప్పక తప్పదు.