Begin typing your search above and press return to search.

ఆమె మండిప‌డింది...రాముల‌మ్మ వెన‌క్కు త‌గ్గింది

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:18 AM GMT
ఆమె మండిప‌డింది...రాముల‌మ్మ వెన‌క్కు త‌గ్గింది
X
కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న కోల్డ్‌ వార్ ఎపిసోడ్‌ లో మ‌రో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మరోసారి ఫైర్ అయిన తీరుతో...ఆ పార్టీలో నెల‌కొన్న ఈ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌హిర్గ‌తం అయ్యాయి. హైదరాబాద్ లో తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో అన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఆవేదనతో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ సీటు టికెట్ తనకే కేటాయించాలని - లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ హెచ్చరించారు. ఈ కామెంట్ల‌కు కార‌ణం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఖ‌మ్మం నుంచి బ‌రిలో దిగనున్నార‌నే ప్ర‌చార‌మే!. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆగ్ర‌హం నేప‌థ్యంలో...రాములమ్మ వెన‌క్కి త‌గ్గారు. తాను ఎంపీ బ‌రిలో లేనంటూ క్లారిటీ ఇచ్చారు!!

కార్య‌క‌ర్తల స‌మావేశంలో రేణుకా చౌద‌రి మాట్లాడుతూ - ఖమ్మంలో గెలుపు తమ వల్లే అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని - కానీ క్రెడిట్ అంతా కార్యకర్తలదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సహకరించలేదని - తనపై ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసారని - తాను తలుచుకుంటే వాళ్లు గెలిచే వాళ్లా అని రేణుకా చౌదరి మండిపడ్డారు. త‌న‌కు మళ్లీ టికెట్ వస్తుందా.. రాదా అనేది ముఖ్యం కాదని - కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని రేణుకా చౌదరి కోరారు. పార్టీలో అన్యాయం జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవమని - కానీ పార్టీని విడిచి పెట్టనని రేణుకా చౌదరి స్పష్టం చేసారు. త్వరలోనే ఖమ్మంలో సమావేశం పెడతానని చెప్పారు. రాష్ట్ర పార్టీ నుండి..అధిష్టానం వరకు చైన్ ఆఫ్ యాక్షన్ జరుగుతోందని, రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా రేణుక చౌద‌రి భ‌గ్గుమ‌న్న నేప‌థ్యంలో...విజ‌య‌శాంతి క్లారిటీ ఇచ్చారు. ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ తాను ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నట్లు వ‌స్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ``నేను ఎంపీ బ‌రిలో నిలువ‌నున్న‌ట్లు గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, నాకు ఏ నియోజకవర్గంలోనూ పోటీ చేసే ఉద్దేశం లేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా నాకు కాంగ్రెస్ అధిష్టానం గురుతర బాధ్యతలు అప్పగించింది. రాబోయే రెండు నెలల వ్యవధిలో పార్టీ తరపున రెండు - మూడు రాష్ట్రాల్లో నిర్వహించబోయే వందలాది సభలు - ర్యాలీలలో పాల్గొని - కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఇంత కీలకమైన కర్తవ్యం ముందున్నప్పుడు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమవ్వాలనే ఆలోచన నాకు లేదనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను.`` అంటూ వివాదానికి ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే, దాదాపు గ‌త 15 రోజులుగా విజ‌య‌శాంతి బ‌రిలో దిగనున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ స్పందించ‌ని రాముల‌మ్మ తాజాగా సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి ఆగ్ర‌హం నేప‌థ్యంలోనే స్పందించ‌డం చూస్తుంటే...ఆమె ఆగ్ర‌హానికే స్పందించిన‌ట్లుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.