Begin typing your search above and press return to search.

యువ‌రాజుకు రాముల‌మ్మ ఆ మాట చెప్పింద‌ట‌

By:  Tupaki Desk   |   8 Nov 2017 6:15 AM GMT
యువ‌రాజుకు రాముల‌మ్మ ఆ మాట చెప్పింద‌ట‌
X
గ్లామ‌ర్ ఉంటే స‌రిపోదు.. అందుకు త‌గ్గ‌ట్లు గ్రామ‌ర్ కూడా అవ‌స‌రం. అప్పుడే అనుకున్న‌ది కుదురుతుంది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్న రాజ‌కీయ నేత‌ల‌తో పోల్చిన‌ప్పుడు రాముల‌మ్మ అలియాస్ విజ‌య‌శాంతి చాలా మంచి పోజిష‌న్లో ఉండాలి. కానీ.. అలాంటిది క‌నిపించ‌దు. ఇప్ప‌టికి వేసే రాజ‌కీయ అడుగుల్లో త‌డ‌బాటు స్ప‌ష్టంగా కనిపిస్తుంది.

సీనియ‌ర్ నేత‌గా .. అంద‌రికి సుప‌రిచితురాలైన విజ‌య‌శాంతి రాజ‌కీయంగా ఆటుపోట్లు బారీగానే ఎదుర్కొన్నారు. నిన్న కాక మొన్న పాలిటిక్స్ లోకి వ‌చ్చిన క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య కాంగ్రెస్ లో ఏ స్థాయికి ఎదిగిందో తెలిసిందే. కానీ.. రాముల‌మ్మ మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లుగా ఉండిపోయిన ప‌రిస్థితి.

టీఆర్ఎస్ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రిగా ఎదిగిన‌ప్ప‌టికీ ఇగో క్లాష్ ల‌తో అధినేతతో స‌రిప‌డ‌క బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె.. కాంగ్రెస్ లో చేరినా ఒరిగిందేమీ లేదు. పార్టీ మార‌టం వ‌ల్ల ఏర్ప‌డే లోటు పూడ్చ‌లేని రీతిలో ఉండాల్సింది పోయి.. మొక్కుబ‌డి రాజ‌కీయాలు చేయ‌టం విజ‌య‌శాంతికి శాపంగా మారాయ‌ని చెప్పాలి. ఏమైందో ఏమో కానీ.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో విజ‌య‌శాంతి భేటీ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో చురుగ్గా క‌నిపించ‌ని ఆమె.. ఇప్పుడు రాహుల్ తో భేటీ కావ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని.. పార్టీ కోసం ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. పార్టీ కోసం సామాన్య కార్య‌క‌ర్త మాదిరి క‌ష్ట‌ప‌డ‌తాన‌ని విజ‌య‌శాంతి చెప్ప‌టం గ‌మ‌నార్హం. మ‌రంత క‌ష్ట‌ప‌డే త‌త్త్వం ఉంటే.. ఇంత‌కాలం కామ్ గాఎందుకు ఉన్న‌ట్లు? ఉన్న‌ట్లుండి ఇప్పుడు క‌ష్ట‌ప‌డాల‌ని రాముల‌మ్మ‌కు ఎందుకు అనిపించింది? లాంటి ప్ర‌శ్న‌లకు ఓ ప‌ట్టాన స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికైనా గతంలో చేసిన త‌ప్పుల్ని మ‌ళ్లీ చేయ‌కుండా రాముల‌మ్మ త‌న స‌త్తా చాటుతుంద‌ని ఆశిద్దాం.