Begin typing your search above and press return to search.

ఆ హీరో ఓటుబ్యాంక్ పెట్రోల్.. డీజిలేనా?

By:  Tupaki Desk   |   24 Feb 2016 4:40 AM GMT
ఆ హీరో ఓటుబ్యాంక్ పెట్రోల్.. డీజిలేనా?
X
ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వటం మామూలే. అయితే.. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు ఇవ్వని సరికొత్త హామీని తెరపైకి తీసుకొచ్చారు తమిళ హీరో.. డీఎండీకే అధినేత విజయకాంత్. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో భాగంగా.. తన పార్టీ ఎన్నికల ప్రణాళిక అంటూ కొంతభాగాన్ని విడుదల చేయటం.. అందులోని ఒక అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గత ఐదేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమ్మకు చెక్ పెట్టటంతో పాటు.. ఓట్లు నేరుగా తనవైపు దృష్టి సారించేలా ఆయన సరికొత్త ఎన్నికల హామీని తెరపైకి తీసుకొచ్చారు. తన పార్టీ కానీ అధికారంలోకి వస్తే లీటరు పెట్రోల్ రూ.45కు.. లీటరు డీజిల్ రూ.35కు ఇస్తామన్న హామీని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.

పెట్రోల్.. డీజిల్ మీద విధించే పన్నుల మీద కేంద్ర.. రాష్ట్ర సర్కారు అమితంగా ఆధారపడుతున్న వేళ.. బహిరంగ మార్కెట్లో ఉన్న పెట్రోల్.. డీజిల్ పైన ఉన్న ధరలకు దాదాపుగా లీటరకు రూ.15కు పైనే తగ్గిస్తానంటూ విజయకాంత్ ఇస్తున్న హామీ తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. పెట్రోల్.. డీజిల్ మీద కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. పన్నుల మోత తగ్గించటం ద్వారా.. ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించాలన్నది విజయకాంత్ ఆలోచనగా చెబుతున్నారు.

తాజాగా ఆయన ప్రకటించిన హామీకి మించిన సంక్షేమ పథకం మరేం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి హామీ అందరికి ప్రయోజనం కలిగించటంతో పాటు.. అనునిత్యం అందరూ లబ్థి పొందేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓపక్క విజయకాంత్ ను తమ కూటమిలో చేర్చుకోవాలని పలు వర్గాలు భావిస్తుంటే.. అందుకు భిన్నంగా విజయకాంత్ మాత్రం.. తనతో మిగిలిన వారు కలవాలన్న ఆలోచనను ఆవిష్కరిస్తున్నారు. పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా విజయకాంత్ ప్రకటించిన పెట్రోల్.. డీజిల్ హామీ తీరు చూస్తే.. తమిళ రాజకీయాల్నే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చే హామీల తీరు మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.