Begin typing your search above and press return to search.

విజయ్ కాంత్ కామెడీ పీస్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   10 March 2019 10:45 AM GMT
విజయ్ కాంత్ కామెడీ పీస్ అయిపోయాడు
X
విజయ్ కాంత్ తమిళనాట ఒకప్పుడు పెద్ద హీరో. కానీ ఆయన అవతారం.. ఆయన చేసిన సినిమాలు చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంటుంది. ఆయన సినిమాల మీద యూట్యూబ్‌ లో బోలెడన్ని మీమ్స్ చూడొచ్చు. సినిమాల సంగతలా ఉంచితే రాజకీయాల్లో మాత్రం ఆయన పక్కా కామెడీ పీస్ అయిపోయాడు. నటుడిగా కెరీర్ ముగిసిపోతున్న సమయంలో డీఎండీకే అనే పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో పోటీ చేశాడు విజయ్ కాంత్. ఐతే ఆయన ఒక్కడు మినహాయిస్తే పార్టీ నుంచి ఇంకెవ్వరూ గెలవలేదు. అయినప్పటికీ విజయ్ కాంత్ వెరవలేదు. తర్వాతి ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుతో 41 సీట్లలో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. అప్పటి విజయాన్ని ఉపయోగించుకుని పార్టీని సవ్యంగా నడిపి ఉంటే ఇప్పుడు సీఎం పదవికి గట్టి పోటీదారుగా మారేవాడేమో. కానీ ఎన్నికల ముందు జయలలిత పార్టీలో పొత్తు పెట్టుకుని.. ఫలితాల తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్నాడయన.

పార్టీని నడపడం విఫలమై వచ్చే ఎన్నికల నాటికి జీరో అయిపోయాడు. 2015 ఎన్నికల్లో డీఎంకే పొత్తుకు ఆహ్వానించినా తిరస్కరించి సొంతంగానే పోటీ చేశాడు. ఆయన పార్టీ తుస్సుమనిపించింది. గత మూణ్నాలుగేళ్లలో విజయ్ కాంత్ ప్రభావం మరింత తగ్గింది. ఇప్పుడాయన ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఎన్డీఏతో జట్టు కట్టిన అధికార అన్నాడీఎంకే పార్టీ.. పీఎంకేను కూడా కలుపుకుని ఎన్డీయేలో భాగస్వామిని చేసింది. విజయ్ కాంత్‌ను కూడా తమతో కలిపేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. కానీ విజయ్ కాంత్ ఎటూ తేల్చట్లేదు. విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్న విజయ్ కాంత్.. అన్నాడీఎంకేతో చర్చలు జరుపుతూనే ఉన్నాడు కానీ.. తన స్టాండ్ మాత్రం చెప్పట్లేదు. తాజాగా తమిళనాట మోడీ పర్యటన నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు, బేనర్లు పెట్టారు. అందులో అధికార పార్టీతో పాటు బీజేపీ, పీఎంకే పార్టీల నేతల ఫొటోలు పెట్టారు. మధ్యలో ఒక చోట ఖాళీ వదిలారు. విజయ్ కాంత్ పొత్తుకు ఓకే చెబితే.. ఆ ఖాళీ ప్లేస్‌లో ఆయన ఫొటో పెడదామన్నది వారి ఆలోచన. కానీ విజయ్ కాంత్ ఎటూ తేల్చట్లేదు. ఐతే ఈ ఫ్లెక్సీలు, బేనర్లను చూసి అందరూ కామెడీ చేస్తున్నారు. విజయ్ కాంత్ కన్ఫ్యూజన్‌ కు దీన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.