Begin typing your search above and press return to search.

ఇంకో సీఎం అభ్య‌ర్థికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

By:  Tupaki Desk   |   2 April 2017 4:42 AM GMT
ఇంకో సీఎం అభ్య‌ర్థికి తీవ్ర అస్వ‌స్థ‌త‌
X
త‌మిళనాడులోని ముఖ్య రాజ‌కీయ నాయ‌కులంద‌రికి వ‌రుసగా అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. దివంగత ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత అస్వ‌స్థ‌త పాలై సుదీర్ఘ శ‌స్త్రచికిత్స‌ అనంత‌రం ఆస్ప‌త్రిలోనే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో డీఎంకే ర‌థ‌సార‌థి అయిన క‌రుణానిధి సైతం ఆస్ప‌త్రి పాల‌య్యారు. అనంత‌రం ఆయ‌న డిశ్చార్జి అయ్యారు. ఇపుడు ఇదే కోవ‌లో త‌మిళ‌నాడులో కీల‌క పార్టీ అయిన డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్య ప‌రిస్థితి కూడా క్లిష్టంగా మారిన‌ట్లు తెలుస్తోంది.

గత ఏడు రోజులుగా పోరూర్‌ లోని ఓ ఆస్పత్రిలో విజ‌య్‌ కాంత్‌ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న‌ ఆరోగ్యం ఇంకా కోలుకో పోవ‌డంతో సింగపూర్‌ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మెరుగైన వైద్య‌సేవ‌లు అందేందుకు, త్వ‌రిత‌గ‌తిన కోలుకునేందుకు ఆయనను సింగపూర్‌ కు తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఆయన సతీమణి ప్రేమలత డాక్టర్ల‌తో చర్చిస్తున్నట్టుగా సమాచారం.

కొద్దికాలం క్రితం ప్రేమ‌ల‌త మాట్లాడుతూ విజయ్‌ కాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దంటూ కొద్దికాలం క్రితం వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆర్కేనగర్‌ ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తాడని ప్రేమలత కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇలాంటి సమయంలో విజయ్‌ కాంత్‌ కు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో డీఎండీకే గెలిస్తే తానే సీఎం అవుతాన‌ని విజ‌య్ కాంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే వామ‌పక్షాలు స‌హా మ‌రికొన్ని పార్టీల‌తో పెట్టుకున్న పొత్తు విఫ‌లం అయి డీఎండీకే ఘోర ప‌రాజ‌యం పాలైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/