Begin typing your search above and press return to search.

కెప్టెన్ యాగం వెనుక లెక్కేంటి?

By:  Tupaki Desk   |   9 April 2016 8:09 AM GMT
కెప్టెన్ యాగం వెనుక లెక్కేంటి?
X
రాజకీయ నాయకులకు నమ్మకాలు ఎక్కువే. తమ మీద కంటే కూడా జ్యోతిష్యం మీదా.. పండితుల మీదా.. వాస్తు మీదా వారికి గురి ఎక్కువన్నట్లుగా కనిపిస్తుంది. కాలం తమకు కలిసి వచ్చేలా ఉండటం కోసం.. తమకు తిరుగులేకుండా ఉండేందుకు వారు చేయని ప్రయత్నం ఉండదు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి వార్తల్లోకి ఎక్కారు తమిళనాడుకు చెందిన కెప్టెన్ విజయ్ కాంత్. సినిమా హీరోగా సుపరిచితుడైన ఆయన డీఎండీకే పేరుతో పార్టీని పెట్టి.. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలన్నది ఆయన కల. ఇందుకోసం ఆయనెంతో కసరత్తు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో అమ్మతో చేతులు కలిపి బరిలోకి దిగిన ఆయన.. ఈసారి మాత్రం చిన్న పార్టీల్ని చేరదీసి పోటీ చేయటం ద్వారా సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న ప్లాన్ వేశారు. అయితే..వాతావరణం .. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవన్న మాట వినిపిస్తోంది. విజయకాంత్ ధోరణితో విసిగిన పలువురు నేతలు ఆయన నుంచి దూరంగా కాగా.. ఆయన కుడి భుజంగా పేరున్న చంద్రకుమార్ పార్టీని విడిచి పెట్టి వెళ్లటం కెప్టెన్ కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న కెప్టెన్.. తనకున్న శక్తితో పాటు దైవశక్తి జత కావాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం తంజావూరు.. కేరళకు చెందిన వేద పండితుల్ని తీసుకొచ్చిన కెప్టెన్ తన నివాసంలో రాత్రి వేళ ప్రత్యేకంగా యాగం చేయించినట్లు చెబుతున్నారు. ఈ యాగంలో తనతో పాటు తన భార్యను కూర్చోబెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా కెప్టెన్ జరిపిన యాగం మీద పార్టీ నేతల్లోనే కాదు.. తమిళనాట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనుకున్న విధంగానే యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్.. ఆమె సతీమణి.. యాగ కుంకుమ.. విబూదిని పార్టీ నేతలకు పంపిణీ చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అన్న ప్రశ్నకు తగ్గట్లే కెప్టెన్ చేసిన యాగంతో ఆయనకు చిరకాల వాంఛ అయిన సీఎం పదవి దక్కుతుందా? అన్నది చూడాలి.