Begin typing your search above and press return to search.

కెప్టెన్ ట‌ర్న్స్‌!... త‌మిళ‌నాట మోదీకి దెబ్బేనా?

By:  Tupaki Desk   |   4 March 2019 1:06 PM GMT
కెప్టెన్ ట‌ర్న్స్‌!... త‌మిళ‌నాట మోదీకి దెబ్బేనా?
X
త‌మిళ‌నాట రాజ‌కీయాలు చాలా వెరైటీగానే ఉంటాయ‌ని చెప్పాలి. సెంటిమెంట్ కాస్తంత ఎక్కువ‌గా పండించే త‌మిళ తంబీలు... ఏ విష‌యాన్నీ అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌రు. రాజ‌కీయాల్లోనూ అంతే. ఇప్పుడ‌క్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు ఏమీ లేవు గానీ... సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డి పొత్తులు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారిపోయాయి. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాట బ‌లం పెంచుకొందామ‌న్న వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ... ఇప్ప‌టికే అన్నాడీఎంకే, డీఎండీకేల‌తో పొత్తు పెట్టుకుంది. ఉత్త‌రాదిన ఎలాగూ ఓ మోస్త‌రు సీట్లు త‌గ్గ‌నున్న నేప‌థ్యంలో ద‌క్షిణాదిన సీట్లు పెంచుకోకుంటే క‌ష్ట‌మేన‌న్న రీతిలో ముందుకు సాగుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... అన్నాడీఎంకే, డీఎండీకేల‌తో పొత్తుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేర‌కు మూడు పార్టీల మ‌ధ్య పొత్తు కూడా కుదిరిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అంతా బాగుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో డీఎండీకే అధినేత, ప్ర‌ముఖ సినీ న‌టుడు విజ‌య‌కాంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా సాగుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీల‌తో పొత్తును తెంచేసుకుని డీఎంకేతో ఆయ‌న క‌లిసిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న‌లు ఇప్పుడు అక్క‌డ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా రేపు జ‌ర‌గ‌నున్న డీఎండీఏ ఆఫీస్ బేరర్ల స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. అయినా నిన్న‌టిదాకా అన్నాడీఎంకేతో బాగానే ఉన్న విజ‌య‌కాంత్ ఎందుక‌ని ఈ త‌ర‌హా నిర్ణ‌యం దిశ‌గా సాగుతున్నార‌న్న విష‌యం కూడా మ‌రింత ఆసక్తి క‌లిగించేదే. అదేంటంటే... రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన సీట్ల‌కు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే క‌దా. ఈ ఖాళీ రాజ్య‌స‌భ సీట్లలో త‌మిళ‌నాడు కోటా కూడా ఉంద‌ట‌. దీంతో త‌మ పార్టీకి ఓ రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌ని విజ‌య‌కాంత్ కూట‌మిలోని మిత్రుల‌ను కోరార‌ట‌.

అయితే అందుకు స‌సేమిరా అన్న బీజేపీ, అన్నాడీఎంకేలు.. త‌మ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల‌తో ద‌క్కే రాజ్య‌స‌భ సీట్ల‌ను ఇత‌ర పార్టీల‌కు ఎలా ఇస్తామంటూ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయ‌ట‌. దీంతో తీవ్రంగానే హ‌ర్ట్ అయిన విజ‌య‌కాంత్‌... రాజ్య‌స‌భ సీటిస్తేనే... లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పొత్తు ఉంటుంది, లేదంటే లేద‌ని తేల్చేశార‌ట‌. అంతేకాకుండా త‌న‌కు అన్నాడీఎంకే, బీజేపీలు లేకున్నా... డీఎంకే ఎలాగూ ఉంద‌ని కూడా ఆయ‌న ఓ ఫీల‌ర్ వ‌దిలార‌ట‌. దీంతో అప్పటిక‌ప్పుడు రంగంలోకి దిగిన అన్నాడీఎంకే నేత‌లు... విజ‌య‌కాంత్‌ ను దారిలోకి తెచ్చుకునేందుకు య‌త్నాలు ప్రారంభించార‌ట‌. ఇదిలా ఉంటే... ఎల్లుండి (బుధ‌వారం) మోదీ త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న‌కు ఒక్క‌రోజు ముందుగా డీఎండీఏ ఆఫీస్ బేరర్ల స‌మావేశ‌మంటూ విజ‌య‌కాంత్ ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే... మోదీకి దెబ్బ తప్ప‌దా? అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?