Begin typing your search above and press return to search.

కెప్టెన్ కాదంట.. ఇక వదినమ్మేనంట

By:  Tupaki Desk   |   29 July 2016 4:47 AM GMT
కెప్టెన్ కాదంట.. ఇక వదినమ్మేనంట
X
తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పు ఒకటి చోటు చేసుకోనుంది. అన్నాడీఎంకే.. డీఎంకేలకు ప్రత్యామ్నాయం అంటూ అవతరించిన సినీ నటుడు విజయ్ కాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకే లో ముఖ్యమైన మార్పు జరగనుంది. ఇప్పటివరకూ పార్టీలో ఎలాంటి పదవి లేకున్నా.. విజయకాంత్ సతీమణిగా చక్రం తిప్పిన ప్రేమలతా ఇకపై అధికారికంగా చక్రం తిప్పే రోజులు దగ్గరకు వచ్చేశాయి. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకున్న బలాన్ని ఓవర్ గా ఊహించుకొని బొక్కబోర్లా పడిన డీఎండీకే పార్టీని కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. పార్టీలో కీలక బాధ్యతల్ని ప్రేమలతకు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇటీవల ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ చెల్లాచెదురు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వదినమ్మగా అందరికి సుపరిచితురాలైన ప్రేమలతకు పార్టీలో కీలకపదవి అప్పజెప్పటం ద్వారా.. పార్టీని ఆమె నేరుగా నడిపేలా చేయాలని విజయకాంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం పార్టీ కార్యదర్శి పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ పెట్టిన కొద్దికాలం పాటు తెర వెనుక ఉండిపోయిన ఆమె.. తర్వాతి కాలంలో పార్టీలో పదవి లేకున్నా.. పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. నోటి దురుసుతనం ఎక్కువైన విజయకాంత్ చేసే తప్పుల్ని కవర్ చేస్తూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కాకుంటే.. ఆశ స్థాయి దాటి దురాశ ఎక్కువైన ప్రేమలత వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినట్లుగా పలువురు విశ్లేషిస్తుంటారు. అయితే.. ఎన్నికల సందర్భంగా తన వాక్ చాతుర్యంతో తమిళ ప్రజల మనసుల్ని దోచుకున్నారనే చెప్పాలి.

ఇక.. ఇంతకాలం పదవి లేకుండా పార్టీలో కీలకభూమిక పోషించిన ప్రేమలతకు ఉన్నట్లుండి ఇప్పుడు పార్టీ బాధ్యతల్ని అప్పగించటం వెనుక కారణం వేరే ఉంది. ఎలాంటి పదవి లేకుండా పార్టీలో ఆమె చక్రం తిప్పుతున్న వైనాన్ని పలువురు ప్రశ్నించటం.. విమర్శించటం.. పార్టీ నుంచి వీడిపోయి దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పజెప్పటం ద్వారా విమర్శకుల నోళ్లు మూత పడేలా చేయాలని విజయకాంత్ భావిస్తున్నారని.. అందుకు తన భార్యకు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. అనధికారికంగానే పార్టీలో చెలరేగిపోయిన వదినమ్మ.. అధికారికంగా పార్టీ పదవి అప్పజెప్పిన తర్వాత ఇంకెంతలా చెలరేగిపోతారో చూడాలి.