Begin typing your search above and press return to search.

`వైఎస్ మంత్రివ‌ర్గం`తో విజ‌య‌మ్మ భేటీ... ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:30 PM GMT
`వైఎస్ మంత్రివ‌ర్గం`తో విజ‌య‌మ్మ భేటీ... ఏం జ‌రుగుతుంది?
X
దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 12వ వ‌ర్ధంతి వ‌చ్చే నెల 2న జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకు ని.. ఆయ‌న స‌తీమ‌ణి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు.. వైఎస్ విజ‌య‌మ్మ‌.. హైద‌రాబాద్‌లో ఒక ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అది కూడా దివంగ‌త వైఎస్ జ‌మానాలో ఆయ‌న మంత్రి వ‌ర్గంలో ప‌నిచేసి మాజీ అమాత్యులు... మేధావులతో ఆమె స‌మావేశం నిర్వ‌మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో అత్యంత ఆస‌క్తిగా మారింది.

ఈ స‌మావేశానికి సంబంధించి విజ‌య‌మ్మ ఇప్ప‌టికే స‌ద‌రు నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. హైదరాబాద్ లోని హోట‌ల్ నోవాటెల్‌లో సెప్టెంబ‌రు 2న సాయంత్రం 5గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అయి తే.. ఈ ఆహ్వానంలో మాత్రం.. ఇది రాజ‌కీయ స‌మావేశం కాద‌ని.. పార్టీల‌కు కూడా సంబంధం లేద‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఆహ్వానంలో ఏముందంటే.. ``విజ‌య‌మ్మ‌గారు వ్య‌క్తిగ‌తంగా మీకు ఆహ్వానం పంపుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని విజ‌య‌వంతం చేయ‌వ‌ల‌సిందిగా కోరుతున్నారు`` అని మాత్ర‌మే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ స‌మావేశంపై మీడియాలో భిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అస‌లు వైఎస్ దివంగ‌తులై.. 12 సంవ‌త్స‌రాలు అయిన త‌ర్వాత‌.. ఇప్పుడు ఈ స‌మావేశం ఎందుకు? దీనివెనుక ఏముంది? వంటి అనేక అంశాలు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కాగా, ఈ స‌మావేశంలో విజ‌య‌మ్మ‌.. త‌న కుమారుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ కానీ, అదేస‌మ‌యంలో వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ త‌న‌య‌.. ష‌ర్మిల ప్ర‌మేయం ఉన్న‌ట్టు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. విజ‌య‌మ్మ సొంత‌గా తొలిసారి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మ‌మ‌నే చెప్పాలి. అంతేకాదు.. రాజ‌కీయ ప‌రంగా చూసుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌మ్మ ఎప్పుడూ.. ఒంట‌రిగా లేరు. అటు కుమారుడు జ‌గ‌నో.. ఇటు కుమార్తె ష‌ర్మిల‌తోనో ఉన్నారు. కానీ, తొలిసారి ఆమె ఒక్క‌రేఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత‌.. విజ‌య‌మ్మ మ‌ళ్లీ ఇలా స‌భ‌కు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ష‌ర్మిల నిర్వ‌హించిన వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం వేడుక‌లో పాల్గొన్నారు. ఈక్ర‌మంలో తన కుమార్తె ష‌ర్మిల‌ను ఆశీర్వ‌దించాలని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య‌మ్మ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా విజ‌య‌మ్మ ప్ర‌క‌టించిన స‌మావేశం ఉద్దేశం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కీల‌క నేత‌ల‌ను, వైఎస్ మంత్రి వ‌ర్గంలో ప‌నిచేసిన వారిని ఆమె ఆహ్వానించారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు విశ్లేష‌కులు భావిస్తున్న ప్ర‌కారం.. అటు ఏపీ, ఇటు తెలంగాణ‌ల త‌న కుమారుడు, కుమార్తెల రాజ‌కీయాల‌కు అండ‌గా నిల‌వాల‌ని వారి విజ‌య‌మ్మ కోరే ఉద్దేశం ఏమాత్రం లేద‌ని.. కేవ‌లం వైఎస్ ఆర్ ఫౌండేష‌న్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నార‌ని.. స‌మాజంలో పేద‌లు, బ‌డుగుల‌కు సేవ చేయాల‌నే దృక్ఫథంతో ఈ సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. అంటున్నారు. ఈ సంస్థ ఏర్పాటు అటు జ‌గ‌న్‌కు, ఇటు ష‌ర్మిల‌కు కూడా ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.