Begin typing your search above and press return to search.

ఏ అమ్మ‌కూ నా ప‌రిస్థితి రాకూడ‌దు: విజ‌య‌మ్మ క‌న్నీటి ప‌ర్యంతం

By:  Tupaki Desk   |   8 July 2022 10:23 AM GMT
ఏ అమ్మ‌కూ నా ప‌రిస్థితి రాకూడ‌దు:  విజ‌య‌మ్మ క‌న్నీటి ప‌ర్యంతం
X
ఏపీ అధికార పార్టీ వైసీపీనిర్వ‌హిస్తున్న ప్లీన‌రీలో ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌ను వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికిరాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. కొద్దిసేపు ఆమె మౌనంగా ఉండిపోయారు. చెమ‌ర్చిన క‌ళ్ల‌తో క‌నిపించారు. అనంత‌రం మాట్లాడుతూ.. త‌న ర‌క్తం పంచుకుని పుట్టిన ష‌ర్మిల‌.. క‌ష్టాల్లో ఉన్నార‌ని.. తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్నార‌ని.. తెలిపారు. జ‌గ‌న్ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు.. తాను ఏపీలో ఆయ‌న కోసం ప్ర‌చారం చేశాన‌ని చెప్పారు.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సుఖంగానే ఉన్నాడ‌ని,, ఈ సుఖాన్ని తాను అనుభ‌విస్తే.. పొరుగు రాష్ట్రంలో క‌ష్టంలో ఉన్న ష‌ర్మిల‌కు అన్యాయం చేసిన‌ట్టే అవుతుంద‌ని అన్నారు. ఇది త‌న మ‌న‌స్సాక్షికి విరుద్ధ‌మ‌ని విజ‌య‌మ్మ ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. తాను మ‌న‌స్సాక్షి ప్ర‌కారమే న‌డుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే తాను వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించాన‌న్నారు. త‌న‌ను అంద‌రూ క్షమించాల‌ని కోరారు.

త‌న అవ‌స‌రం ఎప్పుడున్నా..తాను ఏపీకి వ‌స్తాన‌ని.. కానీ, ముందు ష‌ర్మిల‌కు అండ‌గా ఉంటాన‌ని రాజ‌కీ యంగా ష‌ర్మిల నిల‌దొక్కుకునే వ‌రకు ఆమెకు కూడా తాను సాయం చేయాల్సిన బాధ్య‌త ఉంటుంద‌న్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌లు ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌యాణం ప్రారంభించార‌ని విజ‌య‌మ్మ తెలిపారు. ఈ ప్ర‌యాణంలో అనేక ఇబ్బందులు స‌మస్య‌లు వ‌చ్చాయ‌న్నారు. అయినా కూడా వైఎస్ స్ఫూర్తితో వారు అడుగులు వేస్తున్నార‌ని విజ‌య‌మ్మ తెలిపారు.

అయితే.. విజ‌య‌మ్మ రాజీనామాపై అనేక ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కావాల‌నే ప‌ట్టుబ‌ట్టి.. ఆమెతో రాజీనామా చేయించార‌ని అంటున్నారు. ష‌ర్మిల పార్టీకి విజ‌య‌మ్మ మ‌ద్ద‌తిస్తున్నందునే.. ఇలా చేసి ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనివెనుక పెద్ద ఎత్తున గ‌త ఆరు మాసాలుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని, ప్లీన‌రీ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌క‌ట‌న వెనుక పెద్ద క‌స‌ర‌త్తే ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.