Begin typing your search above and press return to search.

బాబుకు హోదాపై స‌ల‌హా ఇచ్చిన విజ‌య‌మ్మ‌

By:  Tupaki Desk   |   8 April 2018 2:30 PM GMT
బాబుకు హోదాపై స‌ల‌హా ఇచ్చిన విజ‌య‌మ్మ‌
X
హోదాపై ఇప్ప‌టికే ప‌లుమార్లు క‌ప్ప‌దాట్లు.. యూట‌ర్న్ లు తీసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ సూచ‌న చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు ప‌రిస్థితులు ఇంకా చేజారిపోలేద‌న్నారు. పార్టీల‌కు అతీతంగా పోరాటం చేయ‌టానికి బాబు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

ఢిల్లీలో త‌మ పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు వ‌చ్చిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె నిర‌స‌న దీక్షా వేదిక మీద నుంచి మాట్లాడారు. దీక్ష‌కు మ‌ద్ద‌తు ప‌లికిన ఎంపీల‌కు కృతజ్ఞతలు చెప్పిన విజ‌య‌మ్మ ఏపీకి ప్ర‌త్యేక హోదా అన్న‌ది ఊపిరి లాంటిద‌న్నారు.

హోదా అంశంలో ఢిల్లీ పెద్ద‌ల్ని నిల‌దీయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ‌డిచిన నాలుగేళ్ల‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌లుమార్లు నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేప‌ట్టార‌ని.. కేంద్ర‌ప్ర‌భుత్వంపై ప‌లువిధాలుగా ఒత్తిడి తెచ్చిన‌ట్లుగా చెప్పారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు మాత్రం హోదా అంశాన్ని నానార‌కాలుగా హేళ‌న చేసిన‌ట్లుగా చెప్పారు. నాలుగేళ్ల ప‌ద‌వీ కాలంలో బాబు ఒక్క ప‌రిశ్ర‌మ‌ను కూడా రాష్ట్రానికి తీసుకురాలేక‌పోయార‌న్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ యూత్ కి ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్న ఆమె.. ప్ర‌తిపక్షాలు లేకుండా అసెంబ్లీని నిర్వ‌హిస్తుండ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. హోదాపై ఊపిరి ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ పోరాటం చేస్తార‌న్న విజ‌య‌మ్మ‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మాదిరి ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీలు సైతం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి దీక్ష చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు.

హోదా సాధ‌న కోసం పోరాడుతున్న సంఘాల‌తో పాటు.. చంద్ర‌బాబుకు తాను చేసే విన్న‌పం ఒక్క‌టేన‌ని.. హోదా సాధ‌న కోసం అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చారు. ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న ఎంపీల‌ను పేరు పేరునా ప్ర‌స్తావించిన ఆమె.. వారి పోరాటం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ఇదిలా ఉంటే.. దీక్ష చేస్తున్న వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం క్షీణించింది. ఆయ‌న ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యులు ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆరోగ్యం క్ర‌మంగా క్షీణిస్తోంది. వ‌య‌సులో ఉన్న వారు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.