Begin typing your search above and press return to search.

అయ్యో.. విజయమ్మ ఎందుకంత తప్పు చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   4 Sep 2021 3:30 PM GMT
అయ్యో.. విజయమ్మ ఎందుకంత తప్పు చేస్తున్నారు?
X
ప్రతి ఆటకు నియమాలు ఉంటాయి. ఎంత పెద్ద ఆటగాడైనా తన పరిమితులకు లోబడి మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అంతకు మించి అడుగు ముందుకు వేసినా.. లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఆటకే ఇన్ని నియమాలు ఉంటే.. రాజకీయ క్రీడలో నిబంధనలు ఫలానా అని రాసి ఉండవు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అడుగు ముందుకు వేయటమా? వెనక్కి వేయటమా? ఎలాంటి అడుగు వేయకుండా కామ్ గా ఉండటమా? అన్నది ఎవరికి వారు తేల్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం వైఎస్ కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే.. వారింట్లో రాజకీయం నిత్యం నడయాడుతూనే ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యేకంగా పొలిటికల్ గేమ్ ఎలా ఆడాలన్నది నేర్పించాల్సిన అవసరం లేదు.

అలాంటిది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తప్పు చేస్తున్నారా? కుమార్తె షర్మిల మీద ఆమెకున్న ప్రేమ.. ఆట నిబంధనల్ని దాటేలా చేస్తుందా? మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా దివంగత మహానేతకు అత్యంత సన్నిహితంగా.. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నో రాజకీయ పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలు ఆమెకు తెలిసినంత బాగా మరెవరికి తెలిసి ఉండకపోవచ్చు. వైఎస్ ధర్మపత్నిగా.. ఆయన వేసే అడుగుల్ని ఎప్పటికప్పుడు ఆమెకు చెబుతారని చెప్పలేం కానీ.. అసలేం జరుగుతోంది? అన్న విషయాలు ఆమెకు తెలీనవి ఏమీ కావు.

అలాంటప్పుడు ఎప్పుడేం చేయాలో అది మాత్రమే చేసే వైఎస్ తీరుకు భిన్నంగా విజయమ్మ ఎందుకు వ్యవహరిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా వైఎస్ పన్నెండో వర్థంతిని పురస్కరించుకొని.. ఆయన సంస్మరణ సభను నిర్వహించటం.. రాజకీయాలకు అతీతంగా వైఎస్ సన్నిహితులంతా హాజరు కావాలన్న వినతికే పరిమితం కాకుండా.. తనకు తాను నేరుగా పలువురితో ప్రత్యేకంగా మాట్లాడి.. సభకు రావాలంటూ ఆహ్వానించారు. ఇలాంటప్పుడు సహజంగానే సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే.. కుమార్తె మీద ఉన్న ప్రేమ నేపథ్యంలో తనకున్న పరిమితుల్ని మర్చిపోయిన విజయమ్మ.. నోరు తెరిచి సభకు రావాలని అడిగారు.

రాజకీయాల్లో బాగా నలిగిన నేతలు విజయమ్మ ఆహ్వానాన్ని ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించటం.. ఆమె మాటను కాదని సభకు వెళ్లటం ద్వారా జరిగే లాభ..నష్టాల్ని ఎవరికి వారు వేసుకోవటం కనిపిస్తుంది. ఈ కారణంగానే.. సభకు ఆహ్వానించిన వారిలో పట్టుమని పది మంది అగ్రనేతలు కూడా రాలేదు. వచ్చిన నలుగురైదుగురిలో ముగ్గురు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వారు. ఆ మాటకు వస్తే.. చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్ అమితంగా అభిమానించే తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాలేదు. టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఇలా ఎవరికి వారు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని తాము అమితంగా అభిమానించే వైఎస్ సంస్మరణ సభకు వెళ్లకపోవటమే ఉత్తమంగా తేల్చారు. దీనికి తోడు రాజకీయాలకు అతీతంగా వైఎస్ సంస్మరణ సభను నిర్వహించి ఉంటే.. వైఎస్ వీర విధేయులందరూ అడ్డంగా బుక్ అయ్యేవారు. కానీ.. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా విజయమ్మ.. షర్మిల ఇద్దరు రాజకీయాల గురించి మాట్లాడటంతో మొదటికే మోసం వచ్చేసిన పరిస్థితి. సంస్మరణ సభను తన పొలిటికల్ మైలేజీకి మార్గంగా మార్చుకోవటంతో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది.

ఇలాంటి పరిస్థితిని ముందే గుర్తించిన నేతలు సభకు దూరంగా ఉండటం ద్వారా.. అనవసరమైన తలనొప్పులకు దూరంగా నిలిచారని చెప్పాలి. భావోద్వేగ నిర్ణయాలతో పోలిస్తే.. ప్రాక్టికల్ అంశాల్ని అంచనా వేయటం ద్వారా నేతల రాజకీయ అనుభవం బాగా పనికి వచ్చిందని చెప్పక తప్పదు. కుమార్తె పొలిటికల్ మైలేజీ కోసం భర్త ఇమేజ్ ను ఆయుధంగా మార్చుకోవాలన్న విషయంలో విజయమ్మ తప్పు చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎందుకంత తప్పు చేస్తున్నారు విజయమ్మ? అన్న ప్రశ్న వైఎస్ అభిమానుల నోటి వెంట వినిపిస్తుండటం గమనార్హం.